తెలంగాణ

telangana

ETV Bharat / state

Rajath kumar: 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు

శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కావాలనే అన్ని విషయాల్లో కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. కృష్ణా బేసిన్‌ బరిధిలో లేని ప్రాంతాలకు ఏపీ నీటిని తరలిస్తూ రాష్ట్రంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. అన్ని అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ముందు బలమైన వాదనలు వినిపిస్తామని రజత్‌కుమార్‌ వెల్లడించారు.

Rajath kumar
రజత్‌కుమార్‌

By

Published : Sep 1, 2021, 12:06 PM IST

Updated : Sep 1, 2021, 3:51 PM IST

Rajath kumar: 'కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది'

హైదరాబాద్‌ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం జరుగుతోంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ (KRMB Chairman MP Singh) అధ్యక్షతన భేటీ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి, గోదావరి జలాల మళ్లింపుపైనా బోర్డు దృష్టి సారించనుంది. చిన్ననీటివనరులు, తాగునీటి లెక్కింపులు, బోర్డు తరలింపు.. అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డు నిర్వహణపైనా చర్చిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరస్పర ఫిర్యాదులపైనా దృష్టి పెట్టనుంది. నీటి వివాదాలల్లో రాష్ట్ర వాదనను గట్టిగా వినిపిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్ వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్‌ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు సరికాదన్నారు.

అక్రమ ప్రాజెక్టు...

రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టని రజత్‌ కుమార్ స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. టెలిమెట్రీల విషయంలోనూ బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీని ఏపీకి తరలించవచ్చని.. అయితే వైజాగ్ తరలించడం కృష్ణా బేసిన్ దాటి గోదావరి బేసిన్‌లో పెట్టడం సరికాదని రజత్‌ స్పష్టం చేశారు.

నీళ్ల కోసమే ఉద్యమం...

తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్ల కోసం జరిగిందన్న రజత్ కుమార్‌.. తెలంగాణలో ఎక్కువ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర అవసరాలతో పోలిస్తే 299 టీఎంసీలు చాలా తక్కువన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలో తలపెట్టిందేనన్న రజత్‌ కుమార్‌.. కొన్ని డీపీఆర్​లు సమర్పిస్తున్నామని వెల్లడించారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణలో జనాభా 300 శాతం పెరిగిందన్న రజత్‌ కుమార్‌.. తాగునీటి అవసరాలకు కేటాయింపులు పెంచాలని కోరతామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పెరిగిన దృష్ట్యా నీటి వాటా కచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందని.. కేఆర్ఎంబీ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని వెల్లడించారు.

కృష్ణా వాటర్​ను వాళ్లు అక్రమంగా తరలించుకుపోతున్నారు. మేం విద్యుత్ ఉత్పత్తిని ఆపలేం. రాష్ట్ర నీటి అవసరాలు తీరాలంటే విద్యుత్ ఉత్పత్తి అవసరం. కృష్ణా జలాల్లో తెలంగాణకు 574.5 టీఎంసీల హక్కు ఉంది. ఇందుకు సంబంధించిన పేపర్లన్నీ కేడబ్యూటీసీ ముందు ఉంచాం. శ్రీశైలంపై కట్టిన పోతిరెడ్డిపాడు, ఇప్పుడు కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవి అక్రమ ప్రాజెక్టులు. టెలిమెట్రీల విషయంలో కేఆర్ఎంబీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. కేఆర్ఎంబీ ఏం చేస్తోంది. ప్రతి సంవత్సరం 180 టీఎంసీల నీరు ఏపీ తీసుకెళ్తోంది. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా కోసం కృషి చేస్తాం.

-- రజత్‌ కుమార్‌, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ వాదనలు వినిపించింది. గతంలో జరిగిన కృష్ణా జలాల పంపిణీ తాత్కాలికమని రజత్‌ కుమార్‌ అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య 512: 219 నీటి పంపిణీ తాత్కాలికమని ఆయన పేర్కొన్నారు. కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా అంగీకారం కుదిరిందన్న రజత్ కుమార్‌... ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తయినందున నీటి వినియోగం పెరిగిందని తెలిపారు. 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీని 2018 నుంచి కోరుతున్నాని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచి 50: 50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని కోరారు. 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీపై రాజీ పడేది లేదని తేల్చారు. నీటిపంపిణీపై ఛైర్మన్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 70:30 నిష్పత్తిలో జలాల పంపిణీని అంగీకరించమని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి:TS High Court: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Last Updated : Sep 1, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details