తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2020, 8:03 AM IST

ETV Bharat / state

జూన్‌లో విస్తారంగా వర్షాలు.. గతేడాది కన్నా 65% అధికం

రాష్ట్రంలో తొలకరి వర్షాలు తొలి నెలలో ఆశాజనకంగా కురిశాయి. నైరుతి రుతుపవనాలు సకాలంలో రావడం వల్ల జూన్​లో వర్షపాతం రికార్డుస్థాయిలో సాధారణం కన్నా 30 శాతం అధికంగా నమోదైంది. రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది.

Rainfall in June was 65% higher than last year
జూన్‌లో విస్తారంగా వర్షాలు.. గతేడాది కన్నా 65% అధికం

నైరుతి రుతుపవనాలు సకాలంలో రావడం వల్ల రాష్ట్రంలో తొలకరి వర్షాలు తొలి నెలలో ఆశాజనకంగా కురిశాయి. జూన్‌లో వర్షపాతం రికార్డుస్థాయిలో సాధారణంకన్నా 30 శాతం అధికంగా నమోదైంది. గతేడాది జూన్‌ నెలతో పోలిస్తే ఈ పెరుగుదల ఏకంగా 65 శాతం ఉండటం గమనార్హం. రాష్ట్రంలో జూన్‌ నెల సాధారణ వర్షపాతం 132 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను గత నెలలో 171.6 మి.మీ.లు కురిసింది. గతేడాది జూన్‌లో సాధారణంకన్నా 35 శాతం తగ్గి 85.7 మి.మీ.లే కురిసింది. గతేడాది లోటు 35 తీరడమే కాకుండా ఈ ఏడాది మరో 30 శాతం అధికమై మొత్తం 65 శాతం వర్షపాతం పెరిగినట్లయిందని వాతావరణ శాఖ అధికారి రాజారావు వివరించారు.

4 జిల్లాల్లో తగ్గుదల

గతేడాది జూన్‌లో కేవలం 4 జిల్లాల్లో(జగిత్యాల, హైదరాబాద్‌, జనగామ, కరీంనగర్‌) మాత్రమే సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది అదే నెలలో ఆదిలాబాద్‌లో 13 శాతం, జగిత్యాలలో 22, నిర్మల్‌లో 17, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణంకన్నా ఎక్కువ శాతం వర్షాలు కురిశాయి. వర్షాలు బాగా కురవడంతో రాష్ట్రంలో ఇప్పటికే 35 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

నేడు, రేపు ఉరుములు మెరుపులతో వర్షాలు..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా ముల్కలపల్లి (భద్రాద్రి జిల్లా)లో 14, యాచారం(రంగారెడ్డి)లో 11.2, వెల్గొండ(వనపర్తి)లో 9.2 సెంటీమీటర్ల భారీవర్షం పడింది. మంగళవారం అత్యధికంగా ఇస్లాంపూర్‌(మెదక్‌)లో 7.8, సిర్గాపూర్‌(సంగారెడ్డి)లో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇవీ చూడండి: రైతులకు శుభవార్త: రూ.210 కోట్ల బకాయిలు విడుదల

ABOUT THE AUTHOR

...view details