Rahul Gandhi Telangana Tour: మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన దృష్ట్యా టీపీసీసీ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. మే 6న రాష్ట్రానికి రానున్న రాహుల్.. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో నేరుగా వరంగల్‌కు వెళ్లనున్నారు.
వరంగల్‌లో జరగనున్న రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రెండు వేదికలు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ, ఇతర నేతలకు ఓ వేదిక.. ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాలకు మరో వేదికను ఏర్పాటు చేశారు. సభలో 7 గంటల వరకు ముఖ్య నేతలు ప్రసంగించనుండగా.. 7 గంటల నుంచి రాహుల్ ప్రసంగం ప్రారంభం కానుంది. సభ తరువాత రాహుల్ గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. దుర్గం చెరువు పక్కన ఉన్న కోహినూర్ హోటల్లో బస చేయనున్నారు.
ముందుగా అక్కడికి.. తర్వాత గాంధీభవన్‌కు..: 7వ తేదీ ఉదయం హోటల్ కోహినూర్‌లో పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో కలిసి అల్పాహారం చేయనున్న రాహుల్.. అక్కడి నుంచి మొదట సంజీవయ్య పార్కుకి వెళ్లనున్నారు. అక్కడ నివాళులు అర్పించి.. నేరుగా గాంధీ భవన్‌కు చేరుకోనున్నారు.
200 మందితో సమావేశం..: గాంధీభవన్‌లో దాదాపు 200 మంది ముఖ్య నాయకులతో రాహుల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే డిజిటల్ మెంబర్షిప్ ఎన్ రోలెర్స్తో ఫొటో సెషన్లో పాల్గొననున్నారు. ఆ తరువాత లంచ్ మీటింగ్ పూర్తి చేసుకుని.. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
హైదరాబాద్‌కు బైజు..: రాహుల్ పర్యటన దృష్ట్యా రాహుల్ కార్యక్రమాల ఇన్‌ఛార్జి బైజు హైదరాబాద్‌కు వచ్చారు. వారం రోజులుగా వరంగల్, హైదరాబాద్‌లలో ప్రొటోకాల్ అధికారుల పరిశీలన చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస క్రిష్ణన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనపై నాయకులతో మాణిక్కం ఠాగూర్ చర్చిస్తున్నారు.
అనుమతి లేకపోతే:ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులతో సమావేశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం వీసీని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అనుమతి కోరారు. ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. పార్టీలకతీతంగా విద్యార్థులతో సమావేశమయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని సైతం కాంగ్రెస్ ఆశ్రయించింది. అనుమతి రానిపక్షంలో మరుసటి రోజు.... రాహుల్ షెడ్యూల్ ఏవిధంగా ఉండాలి... రైతులు, నిరుద్యోగులతో రాహుల్ గాంధీ నేరుగా మాట్లాడే అవకాశాలపై కూడా నాయకులు చర్చిస్తున్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ నియమ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు రూపకల్పన చేయాల్సి ఉందని మాణిక్కం ఠాగూర్ పీసీసీతో పాటు ఇతర నాయకులకు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..
'20 ఏళ్లు మాట్లాడుకునేలా.. రాహుల్ గాంధీ బహిరంగ సభ'
Rahul Gandhi Telangana Tour: రాహుల్ సభకు కాంగ్రెస్ శ్రేణుల భారీ సన్నాహాలు