Rahul Gandhi Tour: రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. స్థానిక నాయకులతో దిల్లీలో సమావేశమైన రాహుల్ గాంధీ... పీసీసీ ఆహ్వానం మేరకు వచ్చే నెల 6, 7 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వరంగల్ రైతు సంఘర్షణ సభ ద్వారా ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు.. స్థానిక నాయకులతో సమావేశమై సభ నిర్వహణపై సమీక్షించారు. ఆ తరువాత శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా రాహుల్ గాంధీ పర్యటనను ఏ విధంగా విజయవంతం చేయాలన్న దానిపైనే సుదీర్ఘంగా చర్చించారు.
జిల్లాల వారీగా ఇంఛార్జీలు: నాయకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు తీసుకుని క్రోడీకరించుకుని ముందుకు వెళ్లేందుకు పీసీసీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రాహుల్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రొటోకాల్ కమిటీ, కో-ఆర్డినేషన్ కమిటీ, రిసెప్షన్ కమిటీ, పబ్లిక్ మీటింగ్ మానిటరింగ్, స్టేజీ ఏర్పాట్ల కమిటీ, జనసమీకరణ కమిటీ, జిల్లాల వారీగా ఇంఛార్జీలను సైతం పీసీసీ నియమించింది. ఈ కమిటీలల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు దాదాపు అందరు సీనియర్లను భాగస్వామ్యం చేసింది.
భారీ జనసమీకరణ దిశగా: జనసమీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రణాళికాబద్దంగా తరలింపు ఉండేట్లు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. వరంగల్ నగరానికి సమీపంలోని నియోజకవర్గాలు, మండలాలు, ఏడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు. దూరం నుంచి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉన్నా.. అనుకున్న సంఖ్య సభకు వస్తారని అంచనా వేస్తున్నారు.