ఉద్యోగుల వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మక తప్పిదమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ఈ నిర్ణయంతో ప్రజా ధనం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐకాస ఛైర్మన్ నీలా వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
నిరుద్యోగులను మోసం
రాష్ట్రంలో 1 లక్షా 93 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ లెక్కలు చెబుతున్నప్పటికీ... 50 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన పోస్టులను.. అక్రమ ప్రమోషన్ల పేరుతో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు.