దేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుర్తిగా విఫలమయ్యాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. మహిళలు, బాలికలపై కొనసాగుతోన్న వివక్ష, హింస, అత్యాచారాలు, అక్రమ రవాణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గుతున్న దాఖలాలు కనిపించటం లేదన్నారు. వీటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ లైంగిక దాడులకు వ్యతిరేకంగా... హైదరాబాద్ హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద భారత జాతీయ మహిళా సమాఖ్య, దళిత హక్కుల పోరాట సమితి సంయుక్తంగా ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్సి దాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
పట్టపగలే తిరగలేని పరిస్థితి...
స్త్రీలు అర్ధరాత్రి స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్యం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారని... కానీ నేడు మహిళలు పట్టపగలే తిరగలేని పరిస్థితి ఏర్పడిందని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. బేటీ బతికి వుంటేనే కదా చదివేది అని బేటి బచావో - బేటి పఢావో అన్న ప్రధాని మోదీకి తెలియదేమోనని ఎద్దేవా చేసారు. ఈ దారుణాల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉండటం శోచనీయమన్నారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ దళిత యువతి, మన రాష్ట్రంలో ఓ మైనారిటీ బాలిక అత్యాచారాలను ఆయన గుర్తు చేశారు.