Farmers Problems: ప్రస్తుత యాసంగిలో ప్రభుత్వ సూచన మేరకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్రం మొక్కజొన్న కొనేది లేదని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలో కేవలం కంది, సెనగ కేంద్రాలు తెరిచి పరిమితంగా కొనాలని సూచించింది. ఇతర పంటలకు కొనుగోలు కేంద్రాలు తెరుస్తారా లేదా అనేది ఎవరూ ఏమీ చెప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో కంది, సెనగ తప్ప దాదాపు అన్ని పంటలను రైతులు ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. వ్యాపారుల దయ...రైతుల ప్రాప్తం అన్నట్లుగా రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు సాగుతున్నాయి. ఈ యాసంగిలో రాష్ట్రంలో 5,36,449 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. 20 లక్షల టన్నులకు పైగా దిగుబడి రావచ్చని ప్రాథమిక అంచనా. రాష్ట్ర ప్రభుత్వమూ మొక్కజొన్న కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడంతో ఈ పంటనంతా ఇప్పుడిక ప్రయివేటు వ్యాపారులే కొనాల్సి ఉంది.
కొన్ని పంటలకే పరిమితం:కేంద్రం ఏటా 24 రకాల పంటలకే మద్దతు ధరలను ప్రకటిస్తోంది. వాటిలో కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలతోపాటు.. వేరుసెనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటలు ఉన్నాయి. అందులోనూ రాష్ట్ర దిగుబడిలో 25 శాతమే మద్దతు ధరకు కొంటోంది. రాష్ట్ర దిగుబడి ఎంత? అందులో 25% ఎంత అనే లెక్కల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా వ్యత్యాసముంటోంది. అందువల్ల ప్రైవేటు వ్యాపారులు కొనాల్సిన పంటలే ఎక్కువగా ఉంటున్నాయి.
పంట వేసేముందు మినుముకు వాణిజ్య ధర ఇచ్చి కొంటామన్నారు..యాసంగి సీజన్ ఆరంభంలో ప్రత్యామ్నాయ పంటలు వేసే ముందు మినుమును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించింది. వాణిజ్య ధర ఇచ్చి కొంటామని కేంద్రం చెప్పిందని అప్పుడు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. ఇది దేశానికి అవసరమని, బాగా కొరత ఉందని అందుకే మార్కెట్‌లో ఎంత ధర ఉంటే అంత ఇచ్చి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పుడు మద్దతు ధరకైనా కొనేందుకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. రాష్ట్రంలో 71,626 ఎకరాల్లో మినుము వేయగా 54,507 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కానీ కేవలం 13,482 టన్నులే తెలంగాణలో మద్దతు ధరకు కొనాలని జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్)ను కేంద్రం ఆదేశించింది. మినుము పంటకు తాజాగా మూడు కేంద్రాలు ప్రారంభించామని రైతులు ముందుకొస్తే మరిన్ని తెరుస్తామని మార్క్‌ఫెడ్ చెబుతుండగా కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి, లింగంపల్లి తదితర గ్రామాల్లో ఈ పంట కొనేవారు లేక ఏం చేయాలో తోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఉల్లిగడ్డ రూ.వెయ్యికే అమ్మడంతో నష్టపోయా..యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పడంతో తొలిసారి ఉల్లిగడ్డ వేశా. కూలీల ఖర్చులే చాలా ఎక్కువయ్యాయి. రోజుకు ఒక్కో కూలీకి రూ.300 చొప్పున చెల్లించాల్సి వచ్చింది. అర ఎకరం ఉల్లి సాగుకు రూ.20 వేల దాకా పెట్టుబడి పెట్టినా దిగుబడి పెద్దగా రాలేదు. తీరా పంట చేతికొచ్చాక ఉల్లిగడ్డలు అమ్ముదాం అంటే క్వింటాకు రూ.వెయ్యి మాత్రమే ఇస్తామన్నారు. ఈ ధరకు అమ్మడం వల్ల నష్టమే మిగిలింది. ఇతర పంటలు వేసినప్పుడు ప్రభుత్వం మద్దతు ధరకు కొంటేనే రైతుకు కొంతయినా మిగులుతుంది. - దేవయ్య, రైతు, దంతేపల్లి, మెదక్ జిల్లా
లక్ష్యం 80,142 టన్నులు.. కొన్నది 1,833 టన్నులే..కంది పంటను 7,64,657 ఎకరాల్లో సాగుచేయగా 4.67 లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇందులో 80,142 టన్నులే మద్దతు ధరకు కొనాలని కేంద్రం అనుమతి ఇచ్చింది. వ్యాపారులు మద్దతు ధర ఇచ్చి కొంటున్నందున రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తేవడం లేదని, దీంతో 1,833 టన్నులే కొన్నామని మార్క్‌ఫెడ్ తెలిపింది.