PM Modi Hyderabad Tour:హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్- ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకుంటోంది. ఈ వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో రేపు మధ్యాహ్నం 1:25 గం.లకు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరకుంటారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు రాష్ట్ర అధికారులు, భాజపా నాయకులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం ముందు ఏర్పాటు చేసిన వేదిక వద్ధకు చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘన స్వాగతం పలికి సన్మానించనుంది.
పర్యటనకు కేసీఆర్ దూరం:వేదికపై పార్టీ శ్రేణులకు మోదీ అభివాదం చేసి ఉత్తేజాన్ని నింపనున్నారు. ప్రధాని మోదీ రాక పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలకు భరోసా కల్పిస్తోందని భాజపా నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మోదీ సెంట్రల్ యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎస్బీకి చేరకుంటారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. ఈ నెల 26న మోదీ హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనుండగా.. అదేరోజు సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు.
తొలిసారిగా ఐఎస్బీ హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లతో కలిపి ఉమ్మడి స్నాతకోత్సవం నిర్వహిస్తోంది. ఈ స్నాతకోత్సవంలో 2022 సంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 930 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ స్నాతకోత్సవంలో ప్రధాని ముఖ్య అతిధిగా పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన పదిమంది విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను అందజేయనున్నారు. అనంతరం విద్యార్థులను ఉద్ధేశించి మోదీ ప్రసంగించనున్నారు. గంటపాటు ఐఎస్బీలో గడపనున్న ప్రధాని.. తిరిగి 3.50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయల్ధేరి వెళ్లనున్నారు. తిరుగు ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి తలసాని వీడ్కోలు పలుకుతారు.
ఎస్పీజీ అధీనంలోకి:మోదీ రాక నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయాన్ని ఎస్పీజీ తన అధీనంలోకి తీసుకుంది. భద్రతలో పాల్గొనే సిబ్బందికి అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా హెచ్‌సీయూకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎస్బీకి వెళ్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఐఎస్బీ వరకు పీఎంవో భద్రతా విభాగం ట్రయల్ రన్ నిర్వహించింది.