Narendra Modi Hyderabad tour: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఆయన పర్యటనకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మోదీ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 11వేల 355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుడతారని కిషన్‌రెడ్డి ప్రకటించారు. తొలుత ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని.. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తారని తెలిపారు. అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందేభారత్ రైలు (సికింద్రాబాద్ నుంచి తిరుపతి)ను జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఆ తరువాత రూ.715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని వివరించారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య రూ.1,410 కోట్ల వ్యయంతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తారన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా హైదరాబాద్ శివారు పట్టణాలతో అనుసంధానం చేస్తూ 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు.
పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ: తాజాగా చేపట్టనున్న, అందుబాటులోకి వచ్చిన అభివృద్ధి పనులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలపై తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌ను ప్రధాని తిలకిస్తారన్నారు. అనంతరం అక్కడ నుంచి ప్రధాని మోదీ నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచే రూ.7వేల 864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని వివరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు.
40 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా రైల్వేస్టేషన్:ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు ఉపయోగపడేలా ఆధునికీకరించనున్నట్లు కిషన్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం రద్దీ సమయంలో 25 వేల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చుతుండగా.. ఈ పనులు పూర్తయితే 3.25 లక్షల మందికి సేవలందించేలా స్టేషన్ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.