రాష్ట్రంలో మొత్తం 4,744 ఆరోగ్య ఉపకేంద్రాలు(సబ్ సెంటర్లు) ఉన్నాయి. ఏ ఉపకేంద్రం పరిధి నుంచి వైద్యుడి వద్దకు వెళ్లాలన్నా.. సగటున 15-30 కి.మీ. ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుడు లేకపోవడం ఉపకేంద్రాల్లో పెద్దలోటు. 14రకాల పరీక్షలు చేయాలని సంకల్పించినా.. కొన్నిచోట్ల.. అదీ మధుమేహ నిర్ధారణ పరీక్ష మాత్రమే నిర్వహిస్తున్నారు.
ములుగు జిల్లా ఎదిర పీహెచ్‌సీ పరిధిలోని తిప్పాపూర్ ఆరోగ్య ఉపకేంద్రం నుంచి 14 కి.మీ. ప్రయాణిస్తే గానీ వైద్యసేవలు లభించవు. ఇక్కడే నూగూరు ఆరోగ్య ఉపకేంద్రం నుంచి 25 కి.మీ. ప్రయాణం చేస్తే తప్ప ప్రభుత్వ వైద్యుడి దర్శనం దొరకదు. అలాగే కొడిశెల పీహెచ్‌సీకి రావాలంటే.. కాల్వపల్లి ఆరోగ్య ఉపకేంద్రం నుంచి 15 కి.మీ. ప్రయాణించాల్సిందే. ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి.
పోస్టులూ ఖాళీ..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉండాలి. కానీ, దాదాపు 1000కిపైగా ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యంలో శిక్షణనిచ్చిన స్టాఫ్‌నర్సును నియమించి.. ‘హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు’గా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ పథకానికి అతీగతీ లేదు.
ఇది మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లిలో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం. దీని పరిధిలో మరో గ్రామం, ఏడు తండాలూ ఉన్నాయి. ఇద్దరు ఏఎన్‌ఎంలకు గాను ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ముగ్గురు ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. కొత్త భవనాన్ని ప్రారంభించకపోవడంతో.. గత్యంతరం లేక తాత్కాలికంగా పురాతన భవనంలో కొనసాగిస్తున్నారు. ఇక్కడి వారు ప్రభుత్వ వైద్యుడి కోసం సుమారు 15 కి.మీ. ప్రయాణించి తొర్రూరులోని పీహెచ్‌సీకి చేరుకోవాల్సిందే. ఉపకేంద్రంలో వైద్యుడు లేకపోవడం పెద్దలోటుగా మారిందని గ్రామానికి చెందిన మార్త వీరయ్య(55) ఆవేదన వెలిబుచ్చారు.
ఈయన పేరు పొయిలి రాజం(70). పశువుల కాపరి. తొర్రూరు పీహెచ్‌సీ పరిధిలోని గంట్లకుంట్ల గ్రామం. ఇక్కడ ఏడాది కిందట నిర్మాణం ప్రారంభించిన ఆరోగ్య ఉపకేంద్రం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక్కరే ఏఎన్‌ఎం, ముగ్గురు ఆశాలు సేవలందిస్తున్నారు. ఏ చిన్న అనారోగ్యమెదురైనా 25 కి.మీ. ప్రయాణించి తొర్రూరుకు వెళ్లాల్సి వస్తోందని రాజం చెబుతున్నారు. తమ గ్రామానికి చెందిన గర్భిణికి ఆపరేషన్ చేయాల్సి వస్తే దాదాపు 50 కి.మీ. ప్రయాణించి వర్ధన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలనీ, తొర్రూరులో సహజ కాన్పులే చేస్తారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. వైద్యుడి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాజం కోరుతున్నారు.