President Draupadi Murmu ongoing visit to Telangana: ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకున్నారు. ఆదివాసీలు, ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహాలు - పీవీటీజీల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అధికారులు పాల్గొన్నారు. పీవీటీజీ సభ్యులు, విద్యార్థులతో మాట్లాడిన రాష్ట్రపతి విద్య, వైద్యం, తాగు, సాగునీరు, కనీస మౌలిక వసతులపై.. ఆరా తీశారు. గిరిజనులకు రైతుబంధు, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి కల్పిస్తున్నట్లు రాష్ట్రపతికి అధికారులు తెలిపారు. ఆదిమ గిరిజన తెగల ప్రాంతాల్లో 31 పాఠశాలలు, ప్రత్యేక ప్రాథమిక, సైనిక పాఠశాలలు, న్యాయవిద్య, ఫైన్ ఆర్ట్స్ కొరకు ప్రత్యేక కళాశాలలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆదివాసీల అభివృద్ధి కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.
అంతకుముందు హైదరాబాద్‌లో నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను రాష్ట్రపతి సందర్శించారు. సమాచార, శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు.. మరింత ముందంజ వేయాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. రజతోత్సవాలను జరుపుకుంటున్న మహిళా కళాశాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారని హర్షం వ్యక్తంచేశారు. బాలికల పట్ల తల్లిదండ్రులు భేదభావం చూపకూడదని.. వారికి అండగా నిలవాలని కోరారు. అమ్మాయిలు ఉద్యోగం సాధించడమే కాకుండా.. మరింత మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలని రాష్ట్రపతి సూచించారు.