Praja Palana Telangana Applications 2023 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నప్రజాపాలనకు నేడు శ్రీకారం చుడుతోంది. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు(Conferences) నిర్వహించనున్నారు. ప్రజాపాలన కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు.
సుమారు పది శాఖల అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో పర్యటించి ప్రజాసదస్సులు నిర్వహిస్తుంది. ఈనెల 31, జనవరి 1 సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు గ్రామ, వార్డు సభలు ఉంటాయి. ఈ సభల్లో మహాలక్ష్మి(Mahalakshmi Scheme), రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
Praja Palana Program Telangana 2023 :ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పథకాల కోసం ఒకే దరఖాస్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాలి. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాల వంటి పది అంశాలను పూరించాలి. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు.
దరఖాస్తుతోపాటు ఆధార్, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని జత పరిచి వివరాలన్నీ వాస్తవమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి. దరఖాస్తులో కింద ఉన్న ప్రజాపాలన రశీదుకు అధికారులు నంబరు కేటాయించి ఇస్తారు. దరఖాస్తుల ద్వారా అందిన సమాచారం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని సీఎం వెల్లడించారు. సమాచారం ఆధారంగా ఏయే పథకాన్ని ఎందరు ఆశిస్తున్నారు ఎంత ఖర్చవుతుందనే అంచనా వేసి అమలు చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
'గత ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసి పరారైంది'
రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులను సమర్పించవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తు చేయలేకపోయిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఆ తర్వాత పంచాయతీలు, మండల కార్యాలయాల్లోనూ ఇవ్వొచ్చునని తెలిపారు. దరఖాస్తుదారులే గ్రామసభకు వెళ్లాల్సిన అవసరం లేదని, వారి తరఫున ఎవరైనా దరఖాస్తు సమర్పించవచ్చునని చెప్పారు.