తెలంగాణ

telangana

ETV Bharat / state

power cuts: ఏపీలో విద్యుత్​ కోతలు.. అదే కారణం - ap news

ఏపీలో కొన్నేళ్లుగా కనిపించని విద్యుత్‌ కోతలు మళ్లీ మొదలయ్యాయి. వేసవిని తలపించేలా మండుటెండలతో ఉక్కపోత అనుభవిస్తున్న ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి లేదు. గ్రిడ్‌పై భారం తగ్గించడానికి అధికారులు తిప్పలు పడుతున్నారు. అన్ని గ్రామాల్లో రాత్రి 7-10 గంటల మధ్య 2, 3 గంటలపాటు కోతలు విధిస్తున్నారు.

power cuts
power cuts

By

Published : Jul 8, 2021, 10:22 AM IST

ఏపీలో విద్యుత్​ కోతలు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేసవిని తలపించేలా ఉక్కబోస్తున్న సమయంలో విద్యుత్​ కోతలు చెమటలు పట్టిస్తున్నాయి. ఏజీ జెన్‌కో థర్మల్‌, సౌర విద్యుత్‌ ప్లాంట్ల నుంచి రోజుకు సుమారు 95 ఎంయూల విద్యుత్‌ వస్తుంది. బొగ్గు కొరత కారణంగా యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. దీనివల్ల జెన్‌కో నుంచి రోజుకు 84 ఎంయూల విద్యుత్‌ మాత్రమే వస్తోంది. ఇది కూడా విద్యుత్‌ కొరతకు కారణంగా ఉంది. జెన్‌కో నుంచి తీసుకున్న విద్యుత్‌కు డిస్కంలు చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా ఇవ్వడం లేదు. దీనివల్ల బొగ్గు సరఫరా సంస్థలు సింగరేణి, మహానది కోల్‌మైన్స్‌కు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయి. దీనివల్ల బొగ్గు అందుబాటులో ఉన్న సమయంలో నిల్వలను పెంచుకోలేని పరిస్థితి ఏర్పడిందని జెన్‌కో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బొగ్గుకు డిమాండ్‌ పెరగటంతో సింగరేణి నుంచి రోజుకు ఆర్‌టీపీపీ, వీటీపీఎస్‌లకు కలిపి 12 రైల్వే రేక్‌లు(ఒక్కొక్క రేక్‌కు 3,500 టన్నులు) మాత్రమే వస్తున్నాయి.

మహానది నుంచి సముద్రమార్గంలో వెసల్‌ రావడానికి కనీసం వారం రోజులు పడుతోంది.

*కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా సామర్థ్యా న్ని తగ్గించారు. ప్రస్తుతం 3 రోజులకు సరిపడా 40 వేల టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. దీంతో కేవలం 810 మెగావాట్లే వస్తోంది.

*రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులోని 6 యూనిట్లలో 210 మెగావాట్ల సామర్థ్యమున్న యూనిట్‌ను సాంకేతిక కారణాలతో నిలిపేశారు. మిగిలిన యూనిట్ల నుంచి 1,234 మెగావాట్ల ఉత్పత్తి అవుతోంది. ఇక్కడా మూడు రోజులకు సరిపడా సుమారు లక్ష టన్నుల బొగ్గు మాత్రమే ఉంది.

*విజయవాడలోని వీటీపీఎస్‌లోని 1,760 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్ల ద్వారా 1,537.9 మెగావాట్ల విద్యుత్‌ వస్తోంది. మూడు రోజులకు సరిపడా 1.20 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది.

పవన విద్యుత్‌ తగ్గటమే కారణం

రాష్ట్రంలో పవన విద్యుత్‌ గణనీయంగా పడిపోయింది. దీనివల్ల డిమాండ్‌ అంచనాల్లో తేడాలు వస్తున్నాయి. సర్దుబాటు కోసం అప్పటికప్పుడు ఒప్పందం కుదుర్చుకోవటం సాధ్యం కాదు. డే అహెడ్‌ మార్కెట్‌కు ముందు రోజు ప్రతిపాదన ఇవ్వాలి. మస్ట్‌రన్‌ కింద పునరుత్పాదక విద్యుత్‌ తీసుకోవాలన్న నిబంధన దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లను వినియోగంలోకి తేవటం లేదు. దీనివల్ల లోడ్‌ సర్దుబాటు కోసం అవసరమైన సమయంలో కోతలు విధించాల్సి వస్తోంది. కోతల్లేకుండా చూసేందుకు మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం.

- ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌

డిమాండ్‌ తగ్గినా సమస్యే

రాష్ట్రంలో ఈ నెల ఒకటిన విద్యుత్‌ డిమాండ్‌ 191.109 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ)గా ఉంది. వారం రోజుల్లో 179.440 ఎంయూలకు డిమాండ్‌ పడిపోయింది. వ్యవసాయ పనులు పూర్తవడంతో దీనికి వినియోగించే విద్యుత్‌ మరో 20 ఎంయూల వరకు తగ్గడం కొంత ఉపశమనం. అయినా రోజువారీ డిమాండ్‌లో సుమారు 4-5 ఎంయూల కొరత ఏర్పడుతోంది. దీన్ని బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ సంస్థలు సర్దుబాటు చేసుకోవాలి. కానీ, పవన విద్యుత్‌ అందుబాటులో ఉంటుందన్న ధీమాతో విద్యుత్‌ సంస్థలు డే అహెడ్‌ మార్కెట్‌(డామ్‌) నుంచి కొనుగోలుపై దృష్టి పెట్టలేదు. రోజూ 1,500 మెగావాట్లు అందించేలా పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ప్రతిపాదనలను అందించాయి. కానీ మూడు రోజులుగా 60-70 మెగావాట్లకు మించి అందించడం లేదు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు ఇదే ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10.30 మధ్య విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటోంది.

ఇదీ చూడండి:Online Services: ఆ రెండు రోజులు ప్రభుత్వ వెబ్​సైట్లు, ఆన్​లైన్​ సేవలకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details