CM KCR paid tribute to Kaikala Satyanarayana: వెండితెరపై నవరసాలు పండించిన నటశిఖరం కైకాల సత్యనారాయణ మృతి పట్ల అభిమానలోకం విషాదంలో మునిగిపోయింది. కైకాల మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ... తన వైవిధ్యమైన నటన ద్వారా... మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కైకాల పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కైకాల కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు.. నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో కైకాల చెరగని ముద్ర వేసుకున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా సీఎం అభివర్ణించారు. లోక్‌సభ సభ్యునిగా ఆయన చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం కొనియాడారు. ఆయన అందించిన సేవలకు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రేపు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి తలసాని వెల్లడించారు.