లాక్‌డౌన్ అమలుపై పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వ మార్గ నిర్దేశాలకనుగుణంగా పక్కాగా లాక్‌డౌన్ అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
లాక్డౌన్కు సిద్ధమవుతున్న పోలీసులు
రాష్ట్రంలో రేపటి నుంచి లాక్‌డౌన్ అమలుకానున్న తరుణంలో... పోలీసులు విధులకు సిద్ధమవుతున్నారు. ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఆ మేరకు ఏ విధంగా అమలు చేయాలనేదానిపై పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
గత లాక్డౌన్లో పోలీసులు మహానగర వ్యాప్తంగా పలుచోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపట్నుంచి కూడా అదే విధంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్ని బయటకు రానివ్వకుండా చూసేలా ప్రణాళిక చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకొచ్చే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు... లాక్‌డౌన్ నియమ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు రావాలి. ఒకవేళ బయటకొచ్చినా నివాస స్థలం నుంచి నిర్దేశించిన కిలోమీటర్ల లోపే రావాలనే నిబంధనల విధిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.