Hyderabad Chain snatching case update: ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలో పదుల సంఖ్యలో దొంగల ముఠాలు ఉన్నాయి. ఒక్కోముఠాలో 4 నుంచి ఆరుగురు సభ్యులుగా ఉంటారు. వారంతా దేశంలోని ప్రధాననగరాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు, దోపిడీలకు దిగేవారు. శామ్లీ జిల్లాలోని అల్గం గ్రామానికి చెందిన పింకు, అశోక్, మరో ఇద్దరు కలిసి శుక్రవారం ఉదయం బెంగళూరులో 10 చోట్ల దోపిడీలకు పాల్పడ్డారు.
ఆనంతరం ప్రైవేట్ వాహనాల్లో మరుసటిరోజు హైదరాబాద్ చేరారు. పింకు, అశోక్ అబిడ్స్ వద్ద శనివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం చోరీ చేసి వరుస స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఉప్పల్ నుంచి రాంగోపాల్ పేట పరిధిలో 7 చోట్ల గొలుసు చోరీలు చేశారు. ఇద్దరు నిందితుల కదలికలను గమనిస్తూ మరో ఇద్దరు రక్షణగా ఉన్నారు.
దొంగల స్వస్థలం శామ్లీ జిల్లా యూపీ: గొలుసు దొంగతనానికి తొలుత ఇద్దరే వచ్చినట్లు పోలీసులు అనుమానించినా.. ఆ తర్వాత నలుగురు వచ్చినట్లు నిర్ధరణకు వచ్చారు. నిందితుల కోసం ముమ్మర వేట సాగిస్తున్న హైదరాబాద్, రాచకొండ పోలీసులు దొంగల సొంతూరు శామ్లీ జిల్లాకు రెండుబృందాలను పంపగా వారు స్వస్ధలం చేరినట్లు ఆధారాలు లభించకపోవడం నగరంలో మకాం వేసినట్లు అంచనావేశారు. నిందితులను పట్టుకునేందుకు సోమవారం తెల్లవారుజామున నగర వ్యాప్తంగా నాకాబంధీ చేపట్టారు.
పలు ప్రాంతాలు, వాహనాలను తనిఖీ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ఎక్కడా అంతరాష్ట్ర దొంగల ఆనవాళ్లు లభించలేదు. చైన్‌స్నాచర్ల సొత్తును విక్రయించే రిసీవర్లను అదుపులోకి తీసుకున్నా వారి వద్ద ఎలాంటి సమాచారం లభించలేదు. చోరీలు చేసిన తర్వాత నిందితులు సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద వాహనం వదిలేసి ఆటోలో వివిధ ప్రాంతాలను చుట్టేశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు ఏంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టినట్టు సీసీకెమెరాల ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు.