తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం - తెలంగాణ రాజకీయలు

revanth house arrest, congress leaders house arrest
రాష్ట్రవ్యాప్తంగా రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం

By

Published : Feb 16, 2022, 9:49 AM IST

Updated : Feb 16, 2022, 12:42 PM IST

09:44 February 16

ధర్నాకు వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

Congress Leaders House Arrest : రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల ముందు ధర్నాలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యనేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అసోం సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 700పైగా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇవాళ ధర్నాలు చేపడతామని ఇదివరకే ప్రకటించారు. అందుకు ప్రతిగా పోలీసులు గృహనిర్బంధాలు చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టాముట్టారు. ఇంటివద్ద భారీగా పోలీసులను మోహరించి... ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బయటకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డిని ఇంట్లోంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. నిజామాబాద్‌లో మధుయాష్కిని, కామారెడ్డికి వెళ్లకుండా షబ్బీర్‌ అలీని అడ్డుకున్నారు.

ధర్నాలు విరమించాలని కోరిన సీపీ

రేవంత్ రెడ్డి ఇంటివద్ద పలువురు కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేశారు. రేవంత్‌ను కలిసేందుకు వెళ్లిన వారిని అరెస్ట్ చేశారు. నేతల అరెస్టులు, గృబ నిర్బందంపై హైదరాబాద్‌ సీపీ సి.వి.ఆనంద్‌తో పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేయడంపై పొన్నాల నిరసన వ్యక్తం చేశారు. కాగా రేవంత్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సీపీ... కేసు నమోదు చేసినందున ధర్నా విరమించాలని కోరారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని బంజారాహిల్స్​లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. రాహుల్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోవడంతో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ముందు ధర్నా చేపడుతానని ఆయన ప్రకటించగా... రాష్ట్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. రాచకొండ సీపీ కార్యాలయానికి వెళ్లకుండా ఎంపీ కోమటిరెడ్డిని గృహ నిర్భందం చేశారు. భువనగిరిలో అసోం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసినందున అక్కడే కేసు నమోదు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.

పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్న మల్లురవి... ప్రధాని మోదీకి కేసీఆర్‌ కోవర్టుగా మారారని ఆరోపించారు. భాజపా వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు రాకుండా కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాకు లాభం చేసేందుకే మూడో ఫ్రంట్ ముచ్చట్లు అని... కేసీఆర్ మాటలను ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు నమ్మొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లిన మల్లు రవిని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద మల్లు రవి, పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్‌. షాద్‌నగర్‌ కాంగ్రెస్ ఇంచార్జీ శంకర్‌లతో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాలలో ముందస్తుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నాకు వెళ్లకుండా అడ్డుకుంటూ... అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, తెరాస పతనం ప్రారంభమైందని మండిడ్డారు.

మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులను ముందస్తు అరెస్టు చేసారు. ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేయకుండా కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: నిజామాబాద్​లో రౌడీషీటర్ అనుచరుల హల్​చల్

Last Updated : Feb 16, 2022, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details