రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కూడా కొంతమంది వైరస్ బారిన పడుతున్నారు. వాహనాల తనిఖీ, కరోనా రోగుల తరలింపు, శాంతిభద్రతల విధులు ఇలా క్షణం తీరిక లేకుండా ఉండే పోలీసులు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వారిలో కొంతమందికి మహమ్మారి సోకుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 400 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.
150 మందికి...
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సుమారు 150 మందికి కరోనా సోకింది. ఉన్నతాధికారులు... సిబ్బంది విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బందికి ఆరోగ్య నియమాలు వివరించి... తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నారు. వైరస్ సోకే అవకాశం ఉన్న ప్రతి చోటును శానిటైజేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఉపయోగించే ద్విచక్ర వాహనాల్ని, ఇతర వాహనాల్ని శానిటైజ్ చేయిస్తున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
విధి నిర్వహణలో పోలీసులు వివిధ ప్రాంతాల్లో సంచరించాల్సి ఉంటుంది. దర్యాప్తులో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతర వ్యక్తులను పోలీసులు తమ వాహనాల్లో తీసుకుని వెళుతుంటారు. ఒకవేళ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తికి కరోనా ఉంటే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గస్తీ వాహనాలను ప్రత్యేక రసాయనాలతో శానిటైజేషన్ చేయడం వల్ల వైరస్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. మూడు కమిషనరేట్లలోనూ... పోలీసు వాహనాలను శానిటైజేషన్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.