Drugs use control in Telangana : రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ మత్తు ముఠాల కోసం ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే నగరంలో ఉంటున్న నైజీరియన్లతో పరిచయమున్న విక్రయదారులు, కొనుగోలుదారుల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు.
ఎవరెవరితో సంబంధాలున్నాయి..?
అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలతో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు గోవా, ముంబయి, బెంగళూరు నుంచి డ్రగ్స్ నగరానికి వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు... వివిధ సంఘటనలతో పాకిస్థాన్ నుంచి కూడా మత్తు పదార్థాలు హైదరాబాద్‌కు చేరుతున్నట్లు గుర్తించారు. మాదకద్రవ్యాలతో సంబంధమున్న 22 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో నగరానికి చెందిన సైక్రియాటిస్ట్ ఆదిత్యరెడ్డి ఉన్నట్లు తేల్చారు. ఇతని వద్ద మత్తు పదార్థాలు కొనుగోలు చేసిన వినియోగదారులు, ముఠాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. నిద్ర, నొప్పుల ఉపశమనం కోసం ఉపయోగించే మాత్రలను కొందరు అధికధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని జీడిమెట్ల, బాలానగర్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం.