తెలంగాణ

telangana

ETV Bharat / state

పునరావాసం కల్పించాకే ముంపు నిర్వాసితులను తరలించాలి: పవన్

ఏపీలో పునరావాసం కల్పించాకే.. పోలవరం ముంపు నిర్వాసితులను తరలించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో.. నిర్వాసితుల ఇళ్లను కూల్చి వేయటం బాధాకరమని అన్నారు.

polavaram, pawan
పవన్

By

Published : Mar 26, 2021, 8:05 PM IST

ఏపీలో పోలవరం ముంపు నిర్వాసితులను పునరావాసం కల్పించాకే తరలించాలని.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్​కు జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్ట్ కోసం.. ఎన్నో త్యాగాలు చేసినవారి పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతభావం కలిగి ఉండాలన్నారు. పాలకులు ఈ విషయాన్ని విస్మరించి పోలవరం ముంపు ప్రాంతవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి తనకు బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో.. అధికార యంత్రాంగం అనుసరించిన తీరును ఆయన ఖండించారు. జేసీబీలతో ఇళ్లను కూల్చివేసి, ప్రజలు నివసిస్తూ ఉండగానే విద్యుత్ సరఫరా, ఇతర సదుపాయాలు నిలిపివేయటంపై ధ్వజమెత్తారు.

నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నాం..

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్వర్యంలో.. జనసేన బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. సీతారం గ్రామంలో ప్రజలకు పునరావాసం కల్పించకుండానే.. ఇళ్లను ఖాళీ చేయించేందుకు జేసీబీలతో కూల్చివేయడం గర్హనీయమని అన్నారు. ప్రాజెక్ట్ కోసం అన్నీ వదులుకున్నవారి పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మానవత్వం అనిపించుకోదన్నారు.

మౌలిక సదుపాయాలు కూడా లేవు..

ఇల్లు ఇస్తామని పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం.. నిర్వాసితులకు ఇప్పటి వరకూ ఏ ప్రాంతంలో నిర్మిస్తామనేది చూపలేదని ఆరోపణలు చేశారు. కచ్చులూరు, యెనుగులగూడెం నిర్వాసితులలో కొందరికి నిర్మించిన కాలనీల్లోనూ మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు.

వారికి న్యాయం చేయండి

జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో పోలవరం ముంపు బాధితులకు రూ.10 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.6.8 లక్షలే ఇస్తున్నారని మండిపడ్డారు. కటాఫ్ డేట్ వల్ల ముంపు గ్రామాల్లో యువతీ యువకులు పరిహారం ప్యాకేజీకి దూరమైపోయారని.. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details