PM Modi Visakhapatnam tour: విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి సుమారు గంటన్నరసేపు ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర శాఖ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు జీవీఎల్ నరసిం హారావు, సీఎం రమేష్, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణ రెడ్డి, మాధవ్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు. పరిచయ కార్యక్రమం అనంతరం పార్టీ నేతలకు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉండాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి వివక్ష చూపకుండా కేంద్రం ఎంతో కృషి చేస్తోందని.. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని తీవ్రస్థాయిలో ఎండగట్టాలని.. ఇందుకు వెనుకాడొద్దని స్పష్టంచేశారు. రాజకీయాల్లో నిదానం పనికిరాదని.. నిత్యం వేగంగా ఉండకపోతే మన స్థానాన్ని మరొకరు ఆక్రమించేస్తారని పార్టీ నేతలు హితవు పలికారు. సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా స్థానిక సమస్యల పరిష్కారం కోసం గళమెత్తుతూనే ఉండాలన్నారు.
వందే భారత్ రైళ్లను స్వయంగా ప్రారంభిస్తున్నానని.. ఈ కార్యక్రమానికి నేను వెళ్లాల్సిన అవసరం లేదని.. కానీ అభివృద్ధి కోసం మనం చేసే కృషి గురించి ప్రజలకు తెలియాలి కదా అని ప్రధాని వివరించారు. అభివృద్ధి గురించి చెప్పడంలో,ప్రభుత్వ లోపాలు ఎండగట్టడంలో మీమాంస వద్దని తేల్చిచెప్పారు.
అంగన్వాడీల దగ్గర నుంచి పార్టీ కార్యకలాపాలు కొనసాగాలని.. పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందుతుందో లేదో మహిళా మోర్చల ద్వారా నిశితంగా పరిశీలించాలని ప్రధాని సూచించారు.