Car Accident In Hyderabad: హైదరాబాద్ నగరంలో కార్లు సృష్టించే బీభత్సాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందరూ కార్లను వాడడంతో ఇప్పుడు వాటి వాడకం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీటితో ప్రమాదాలు కూడా అదే రీతిలో జరుగుతున్నాయి. నిన్న రంగారెడ్డి జిల్లాలో కారు 15 బైకులను, 2 కార్లను ఢీకొట్టి ధ్వంసం సృష్టించింది. అయితే అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కారుతో ఒక వ్యక్తిని గుద్దితే అతను పల్టీలు కొట్టుకుంటూ.. 20 మీటర్ల దూరంలో పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాగోల్ ఉన్నత పాఠశాల సమీపంలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాగోల్ ఉన్నత పాఠశాల వద్ద వేగంగా వచ్చిన కారు.. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. కుషాయిగూడ నాగారానికి చెందిన వ్యక్తి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ సెల్‌ఫోన్ వైపు చూసుకుంటూ.. నాగోల్ వైపు వెళుతున్నాడు. ఇంతలోనే గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి బలంగా అతనిని ఢీకొట్టింది.
గాల్లో ఎగిరి 20 మీటర్లు దూరం: గాల్లోకి ఎగిరి 20 మీటర్లు దూరంగా పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్నవారు చూస్తుండగానే.. కళ్లముందే అతను పల్టీలు కొడుతూ.. కింద పడ్డాడు. అటుగా వస్తున్న వాహనదారులు.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న స్థానికులు అతనిని గమనించి.. వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడంతో అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి.