పట్నం బతుకులు తలకిందులవుతున్నాయి. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని గట్టెక్కించుకోవాలని నగరానికి వచ్చిన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఆదాయంపై కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. నెలకు రూ. పదిహేను, ఇరవై వేల ఆదాయం ఉండే అల్పాదాయవర్గాల వారు లాక్‌డౌన్ అనంతరం పరిస్థితులు చక్కబడతాయని ఆశించి ఇప్పటివరకు ఏదోలా గడిపారు. జూన్ గడిచిపోయినా చిన్నచిన్న పరిశ్రమలు, వస్త్ర దుకాణాలు, బేకరీలు, రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్‌లు, సినిమా హాళ్లు ప్రారంభం కాలేదు. పరోక్షంగా ఉపాధికి కారణమయ్యే సాఫ్ట్‌వేర్ సంస్థలు, ఇతర పరిశ్రమలు కూడా పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. మధ్యతరగతి ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీనికితోడు మరోసారి హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ విధించనున్నట్లు వార్తలు వస్తుండడం వారిని మరింత కలవరపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో దిక్కులేక నగరాన్ని వీడుతున్నారు.
రూ.6 వేలతో నెట్టుకురావడం కష్టమే
సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో పనిచేసే మల్లేశ్ నెల ఆదాయం రూ.12 వేలు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల నుంచి ఏడేళ్ల క్రితం వచ్చి ఇక్కడ జీవిస్తున్నాడు. కరోనా అతడి కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. రెస్టారెంట్ నడవకపోవడంతో రూ.6 వేలు మాత్రమే వేతనం ఇస్తామని నిర్వాహకులు తెలిపారని, ఇంటి అద్దె రూ.3,500 చెల్లించాల్సి రావడం, ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని సాకడం కష్టంగా మారడంతో నగరం విడిచిపోతున్నామని తెలిపాడు. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేసుకుని బతకాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈయనే కాదు ఆ రెస్టారెంట్‌లో పనిచేసే ఇరవైమందిదీ ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లో ఇల్లు ఖాళీ చేసిన మహబూబ్‌నగర్‌కు చెందిన మరో కుటుంబానిదీ అలాంటి పరిస్థితే. అమీర్‌పేటలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ వచ్చే రూ.15 వేల ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతడికి నిర్వాహకులు రూ.8 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో విధిలేక సొంతూరు వెళ్లిపోతున్నట్లు తెలిపాడు.