భాగ్యనగరంపై దోమల దండయాత్ర సాగుతోంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికీ కష్టాలు తప్పడం లేదు. అత్తాపూర్, బేగంబజార్, టోలిచౌకి, గోల్కొండ, షేక్‌పేట్, ఖైరతాబాద్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉంది.
*అత్తాపూర్ సోమిరెడ్డినగర్‌కు చెందిన వాచ్‌మెన్ కుటుంబంలోని ఇద్దరికి కరోనా సోకింది. దీంతో ఉన్న ఒక్క గదిని వారికి ఇచ్చి మిగిలిన ముగ్గురు బయట వారం రోజులపాటు పడుకున్నారు. దోమల వల్ల ఇద్దరు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు.
*జియాగూడకు చెందిన వ్యక్తికి ఇటీవల కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. సాయంత్రం దోమలు కుడుతున్నాయని, రాత్రంతా కునుకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
*పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉండలేక ఇబ్బందులు పడ్డానని, ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రంలో చేరి ఇటీవలే కోలుకుని బయటికి వచ్చానని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వ్యక్తి వాపోయారు.
నిధులు లేక పనులు ఆగి..
ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్లలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉంది. చార్మినార్, ఖైరతాబాద్ జోన్లకు ఫాగింగ్ యంత్రాలు అందించామని అదనపు సిబ్బందిని నియమించామని ఎంటమాలజీ విభాగం చెబుతోంది. గతంలో మూసీ అభివృద్ధి సంస్థ కూడా 60 మందిని ఏర్పాటు చేసి దోమల నివారణకు చర్యలు తీసుకుంది. నిధులు లేవన్న కారణంతో మూసీ సంస్థ సిబ్బందిని తొలగించింది. గుర్రపు డెక్క తొలగింపు, దోమల మందు పిచికారీ విస్మరించడంతో దోమల ఉద్ధృతి పెరిగింది.