సికింద్రాబాద్‌లోని రోష్ని స్వచ్ఛంద సంస్థ హెల్ప్‌లైన్‌కు మానసిక సమస్యలతో రోజూ 60 మందికిపైగా ఫోన్‌కాల్స్ చేస్తుంటారు. ప్రతి అయిదుగురిలో ఒకరు ఆందోళన, కుంగుబాటు, ఒంటరితనంతో బాధపడుతున్నట్లు చెబుతుంటారు. ఏడాదిగా ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులతో నిర్వేదంలోకి వెళ్లినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వారిలోనే సమస్య ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. మనోధైర్యంతో అవరోధాలను ఎదుర్కొన్న వారు సైతం వ్యతిరేక భావనలతో ఇబ్బంది పడుతున్నారంటున్నారు మనస్తత్వ నిపుణులు.
స్పర్శతో మనోధైర్యం
కన్నతల్లి స్పర్శ అప్పుడే పుట్టిన శిశువుకు భద్రతగా అనిపిస్తుంది. విద్యార్థుల విజయాలను మెచ్చుకొనేందుకు ఉపాధ్యాయులు ఇచ్చే ఆశీర్వచనం మరింత ఉత్సాహాన్నిస్తుంది. సున్నితమైన మానవ సంబంధాలను దూరం చేస్తున్నమాట నిజమేనంటున్నారు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ హరీష్‌చంద్రారెడ్ఢి గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. వారాంతం, సెలవు రోజుల్లో కుటుంబం, స్నేహితులతో కలసి సరదాగా గడపటం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంటారు. ఒకరికొకరం అండ అని చెప్పలేని భావాలను కరచాలనం, భుజాలపై చేతులు వేయటం, శిరస్సును స్పర్శించటం ద్వారా తెలియజేస్తుంటారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ మళ్లీ అవన్నీ దూరమవుతున్నాయి. గతేడాది 10-15 మంది మనస్తత్వ నిపుణులు బృందంగా అధ్యయనం చేశారు. సుమారు 1000-1100 మంది పాల్గొన్న సర్వేలో 30 నుంచి 40 శాతం మంది తమను ఒంటరితనం వేధిస్తున్నట్లు ఆవేదన వెలిబుచ్చారు. పలకరించకపోవటం, చేతులతో స్పర్శించకపోవటాన్ని తాము ప్రామాణికంగా తీసుకున్నట్లు వారు చెప్పటం గమనార్హం.