Revanth Reddy Comments on Outer Ring Road: హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ను నిర్మించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.6,696 కోట్లతో అప్పటి ప్రభుత్వం ఓఆర్ఆర్ను నిర్మించిందని ఆయన గుర్తు చేశారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం తీసుకొచ్చి.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించిందని రేవంత్‌రెడ్డి అన్నారు.
దీని ద్వారా ప్రతీ ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు ఆదాయం వస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఓఆర్‌ఆర్‌ను ముంబయికి చెందిన ఓ కంపెనీకి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టబెట్టిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏడాదికి రూ.750 కోట్లు వస్తుంటే.. రూ.246 కోట్లకే ప్రభుత్వం అమ్మేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. బంగారు బాతును కేటీఆర్ 30 ఏళ్లకు అమ్మేశారని రేవంత్ మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి అడ్డగింత..: అంతకుముందు ఓఆర్‌ఆర్ టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను కలిసేందుకు సచివాలయానికి బయలుదేరిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అధికారులను కలిసేందుకు రేవంత్ అనుమతి తీసుకోలేదన్న పోలీసులు.. సచివాలయం వద్ద భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సచివాలయానికి వెళ్తున్న రేవంత్‌రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్ద అడ్డుకున్నారు.
ఓఆర్‌ఆర్ టెండర్‌పై అధికారులను కలుస్తానన్న రేవంత్‌రెడ్డి.. టెండర్‌ను 30 ఏళ్లకు ఒక సంస్థకు ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. సచివాలయానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారన్న రేవంత్‌రెడ్డి.. వినతి పత్రం ఇచ్చేందుకు ఎప్పుడు రావాలో అధికారులు ఎలా చెబుతారన్నారు. టెలిఫోన్ భవన్ నుంచి మింట్ కాంపౌండ్ వరకు వచ్చేందుకు రేవంత్‌రెడ్డికి పోలీసులు అనుమతిచ్చారు. అక్కడకి పోలీసులు తమ వాహన వలయంలో దగ్గరుండి ఆయన్ను తీసుకెళ్లారు.