Revanth Reddy Comments: తెలంగాణ కాంగ్రెస్‌లోకి త్వరలోనే పెద్దఎత్తున చేరికలు ఉంటాయని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు..... ఆయన దిల్లీలో వెల్లడించారు. దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్కం ఠాగూర్ భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ నేతల తీరు, తిరుగుబాటు ధోరణిపై చర్చించారు. పార్టీలో చేరుతున్న వారికి.... టిక్కెట్లపై అప్పుడే హామీ ఇవ్వలేమని సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
'పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించాం. జులై 7న నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో నేను చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్‌కు వివరించాను. రాబోయే కాలంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. చేరికలపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం. జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నాం. పార్టీలో చేరే వారి గురించి ముందే మీడియాకు తెలియడం వల్ల అధికార పార్టీ వారిపైన కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోంది. అందువల్లనే పార్టీలో చేరే వారి గురించి ముందుగా బయటకు తెలియనివ్వడం లేదు. కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడం లేదు. పార్టీ ప్రక్రియ కిందే టికెట్ల కేటాయింపు ఉంటుంది.' -రేవంత్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి తనను కూడా లంచ్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాదులో జిల్లా కార్యకర్తలను కలుపుకొని విష్ణువర్ధన్ రెడ్డి సభ పెడతారన్నారని.. దానికి పీసీసీ అధ్యక్షుడిగా అన్ని అనుమతులు ఇచ్చానని తెలిపారు. విపక్షాల తరఫు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా మమతా బెనర్జీ ప్రతిపాదించిన పేరును కాంగ్రెస్ పార్టీ సమర్ధించిందని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు సందర్భంగా విపక్షాల మీటింగ్‌కు కేసీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించారు.