Pawan Kalyan on Politics : ‘ప్రస్తుతం నేను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగానే భావిస్తా. కానీ ఎప్పటికీ నేను ఓడిపోయిన వ్యక్తిని కాను. అపజయం కూడా సగం విజయమే అనుకుంటా. నేను కనీసం ప్రయత్నం చేశా. జయాపజయాలను సమానంగా స్వీకరించాలి. సినిమా నేను కోరుకున్నది కాదు.. నా ఆలోచనలు, ఆశయాలు వేరే. సినిమాల్లో నటించేది నా జీవితం కోసమే. రాజకీయాలు మాత్రం దేశం, జాతి కోసమే’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
ఎవరికి వారే రోల్‌మోడల్‌గా ఎదగాలని పవన్‌కల్యాణ్ అన్నారు. ధనార్జనే ధ్యేయంగా కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా జీవితాన్ని కొనసాగించాలన్నారు. ప్రతికూల పరిస్థితులే మరింత బలంగా మారుస్తాయని, కఠిన పరిస్థితులే మరింత రాటుదేలేలా చేస్తాయని మరవద్దన్నారు. ఈ పరిస్థితులే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా తయారు చేస్తాయని విద్యార్థులకు బోధించారు. హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సమావేశంలో పవన్‌కల్యాణ్ ప్రసంగించారు. తెలివితేటలు ఉన్న వ్యక్తి మొదట చేసే పని.. తెలివితక్కువ వ్యక్తి చివరిగా చేస్తాడనే మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎండీ మోతీలాల్ ఓస్వాల్ మాటలను ఆయన ఉటంకించారు.