Cab Fares In Hyderabad: హైదరాబాద్‌లో క్యాబ్ ఛార్జీలను చూస్తే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. విమానాశ్రయానికి వెళ్లాలంటే రూ. వేలల్లో చెల్లించాల్సి వస్తోంది. అక్కడి నుంచి రావాలన్నా తిప్పలు తప్పట్లేదు. రైడ్ బుకింగ్ అయ్యేందుకు 20 నిమిషాలకు మించి సమయం పడుతుంటే.. బుక్ అయిన తర్వాత రద్దు చేయమంటూ సదరు డ్రైవర్లు చెప్పి నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో సమయానికి చేరుకోవాలనే తొందరలో.. మరో రైడ్ బుక్ చేయలేక డ్రైవర్లు చెప్పినట్లు నడుచుకుంటున్నారు.
కొత్తగా నగరానికొచ్చేవారి నిస్సహాయతను గమనించి.. మరికొందరు డ్రైవర్లు అధిక మొత్తం వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇళ్లకు చేరుకునేందుకూ సొంత వాహనాలు లేక రైడ్‌లు బుక్ చేసుకుంటే అవీ అకారణంగా రద్దవుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. స్పందించే, సమీక్షించే వ్యవస్థ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
*కొండాపూర్‌కు చెందిన గోకుల్‌రాజ్ అనే వ్యక్తి విమానాశ్రయం వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ ఛార్జి రూ.2,100 చూసి ముక్కున వేలేసుకున్నాడు. చెన్నై-హైదరాబాద్ ఫస్ట్‌క్లాస్ ట్రైన్ టిక్కెట్ ధర రూ.2,500 ఉంటే, క్యాబ్‌లో కొండాపూర్ నుంచి విమానాశ్రయం వెళ్లేందుకు ఇంత ఛార్జీ ఏంటంటూ అసహనం వ్యక్తం చేశాడు.
*గుంజన్ కశ్యప్ అనే వ్యక్తి సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయం చేరుకునేందుకు క్యాబ్ బుక్ చేశారు. ఛార్జీ రూ.800 కాగా, ఆ రైడ్‌ను రద్దు చేయమంటూ డ్రైవర్ చెప్పడంతో.. ఊరికి కొత్త కావడంతో రైడ్‌ను రద్దు చేశానని, తీరా విమానాశ్రయం వెళ్లాక రూ.1200 కావాలంటూ డిమాండ్ చేశాడంటూ క్యాబ్ సంస్థకు ఫిర్యాదు చేశారు.
వానొస్తే అంతే:వర్షం పడిన సమయంలో, ఆఫీసు సమయాలు, రద్దీ వేళల్లో ఆయా క్యాబ్ సంస్థలు ఆల్గారిథమ్ లెక్కలతో సర్జ్, పీక్ అవర్స్‌ను నిర్దేశిస్తూ మూడు నుంచి నాలుగు రెట్లు వసూలు చేస్తున్నాయి. సర్జ్, పీక్ లెక్కలతో ప్రయాణికులకు ‘వాహనాలు అందుబాటులో ఉన్నా బుక్ అవకపోవడం అంటే కొన్నిసార్లు ఎదురుగా క్యాబ్ ఖాళీగా కనిపిస్తున్నా బుక్ కాకపోవడం.. చాలా ఆలస్యంగా బుక్ అయితే రెండు నుంచి మూడు రెట్లు ఛార్జీలు వేయడం’ వంటివి ఉత్పన్నమవుతున్నాయి.
*నగరంలోని సందర్శనీయ ప్రాంతాల్లోనూ నగరవాసులు రైడ్ బుకింగ్‌కు ఇబ్బందులు పడుతున్నారు. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్, టాంక్‌బండ్ సమీపంలోని లుంబినీ పార్కుకు వెళ్లేందుకు సులువుగా క్యాబ్ బుక్ అవుతుంటే..అక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి రైడ్ బుక్ అవడం లేదు.
రోజూ పదివేల క్యాబ్‌లు:విమానాశ్రయం నుంచి నిత్యం 5వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటికి గంటకు రూ.250 చొప్పున పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు రూ.50 చొప్పున, 24గంటలకు రూ.600 వరకు తీసుకుంటున్నారు. దీనికితోడు కంపెనీల పరంగా బుకింగ్ జరిగితే డ్రైవర్ రైడ్ ఛార్జీల్లో 25శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి. పెట్రోల్ భారంగా మారడంతో, యాప్‌తో రైడ్ బుక్‌చేస్తే చాలామంది డ్రైవర్లు తిరస్కరిస్తున్నారని క్యాబ్ డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి.