స్విట్జర్లాండ్ చేరుకోవాలన్న ఉద్దేశంతో నేను ముందుగా పాకిస్థాన్ వెళ్లాను. అక్కడి భూభాగంలో సుమారు 40కి.మీ.లు నడిచిన తరువాత పాక్ సైనికులకు చిక్కాను. నన్ను వాళ్లు భారత గూఢచారి అనుకున్నారు. స్విట్జర్లాండ్ వెళ్లాలన్న ఉద్దేశంతోనే భారత సరిహద్దుదాటానంటే నమ్మలేదు. పాకిస్థాన్ సైన్యం నన్ను రెండు సంవత్సరాల ఏడు నెలలపాటు వారి కస్టడీలోనే ఉంచుకుని విచారణ చేసింది. నేను వారి దేశ భూభాగంలోకి ప్రవేశించడానికి ఇతర కారణాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నోసార్లు విచారణ చేశారు. స్విట్జర్లాండ్ వెళ్లాలన్న ఆలోచన తప్ప ఎలాంటి ఇతర కారణాలు లేవని ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదు. విచారణ పేరుతో పిలవడం, గంటలపాటు కూర్చోపెట్టడం చేసేవారు.
కొన్నిసార్లు రాత్రి సమయాల్లో పిలిచి ఉదయం వరకు విచారణ చేస్తూనే ఉండేవారు. దీంతో నిద్రలేక చాలా ఇబ్బందిపడేవాడిని. బావల్‌పూర్ జైల్లో నన్ను ఉంచారు. తొలుత మూడు వారాలపాటు ఇద్దరు నిందితులతో కలిపి ఒక గదిలో ఉంచారు. ఆ తరువాత నాకు ప్రత్యేకంగా ఒకగది ఇచ్చారు. జైల్లోకి తీసుకొచ్చిన తరువాత పుస్తకాలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. హనుమాన్ చాలీసా, కంప్యూటర్ సైన్స్ పుస్తకాలు చదివాను.
పాక్ నుంచి వెళ్లాలని లేదా అని భయపెట్టారు...
భారత ఖైదీలతో పనిచేయించేవారు కాదు. మేము ఉండే గది, జైలు ప్రాంగణం శుభ్రంగా ఉంచుకోవాలని మాత్రమే చెప్పేవారు. నేను ‘శ్రీకృష్ణుడి’ భక్తుడిని. జైల్లో కృష్ణుడి ప్రార్థనలు చేసేవాడిని. నా కుటుంబసభ్యుల కోసం, భారతీయుల కోసం, భవిష్యత్తు కోసం నిత్యం ప్రార్థనలు చేస్తుండేవాడిని. పాక్ వెళ్లిన తరువాత నాలో దైవభక్తి పదిరెట్లు పెరిగింది. ఆ ప్రార్థనలు ఫలించి తిరిగి భారత్ చేరుకోగలిగానని విశ్వసిస్తున్నాను. నన్ను ముస్లింగా మారమని జైల్లోని పలువురు సలహా ఇచ్చేవారు. సుమారు 50 మంది వరకు అలా చెప్పారు.. కానీ, ఒత్తిడి మాత్రం తేలేదు. నేనుమాత్రం హిందూ ప్రార్థనలు చేసేవాడిని. జైల్లో చాలా మందికి హిందువులంటే చిన్నచూపు ఉండేది. కొందరు ముస్లింలు తమ గురించి కూడా ప్రార్థించాలని చెప్పేవారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో నేను న్యాయమూర్తికి లేఖ రాశాను. మతం మారాలని తనకు చెబుతున్నారని, మీరు కూడా మతం మారాలని ఆ లేఖలో న్యాయమూర్తిని కోరాను. ఆ విషయం తెలుసుకున్న జైల్లోని కొందరు పాకిస్థాన్ నుంచి వెళ్లాలని లేదా? అంటూ భయపెట్టారు. నా అభిప్రాయం నేను చెప్పడంలో తప్పేముందని భావించేవాడిని.