తెలంగాణ

telangana

ETV Bharat / state

తీరనున్న ఆక్సిజన్‌ కొరత... నేడు రాష్ట్రానికి చేరనున్న ట్యాంకర్లు

తెలంగాణలో ప్రాణవాయువు కొరత తీరనుంది. మరో వారం పది రోజులకు సరిపడా 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నేడు రాష్ట్రానికి రానుంది. ఒడిశా నుంచి బయల్దేరిన ట్యాంకర్లు సోమవారం హైదరాబాద్‌కు చేరనున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్‌కు భారీ డిమాండు ఏర్పడగా.. విమానాల ద్వారా ట్యాంకర్లను ఒడిశాకు పంపి తెప్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

oxygen-tankers-arriving-in-the-telangana-today
తీరనున్న ఆక్సిజన్‌ కొరత... నేడు రాష్ట్రానికి చేరనున్న ట్యాంకర్లు

By

Published : Apr 26, 2021, 6:50 AM IST

ఆక్సిజన్ కొరత తీర్చే నేపథ్యంలో 10 ఖాళీ ట్యాంకర్లను శుక్రవారం ఒడిశాకు పంపించారు. అవి అదే రోజు భువనేశ్వర్‌ నుంచి రవుర్కెలా, అంగుల్‌ ఉక్కు కర్మాగారాలకు చేరాయి. ఆక్సిజన్‌ను నింపుకొని అర్ధరాత్రి తెలంగాణకు బయల్దేరాయి. రవుర్కెలా, అనుగుల్‌ల నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి నేడు హైదరాబాద్‌కు చేరతాయి. మొదట 6, తర్వాత 4 ట్యాంకర్లు వస్తాయని అధికారులు తెలిపారు.


సరఫరాకు ఏర్పాట్లు

మొత్తం 10 ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ హైదరాబాద్‌కు చేరాక యుద్ధప్రాతిపదికన సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ట్యాంకర్లను మొదట ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులకు పంపించి ప్లాంట్లలో నింపుతారు. అనంతరం జిల్లా ఆసుపత్రులకు పంపుతారు. మిగిలిన నిల్వలను ఎక్కడ అవసరమైతే అక్కడికి సిలిండర్లలో పంపిస్తారు. ట్యాంకర్లు రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించాక దారిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్లాంట్లు ఉంటే వాటిలోనూ నింపాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 200 మెట్రిక్‌టన్నుల నిల్వలు వారం, పది రోజుల వరకు కొరతను తీరుస్తాయని అధికారులు చెబుతున్నారు. మరోసారి విమానాల ద్వారా ఒడిశా లేదా చెన్నై, బళ్లారిలకు ట్యాంకర్లు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

19 రైళ్లలో సరఫరా

భారతీయ రైల్వే మొత్తం 19 రైళ్ల ద్వారా ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 10 రైళ్ల ద్వారా 150 మెట్రిక్‌ టన్నులను గమ్యస్థానానికి చేర్చామని, ఇప్పుడు మరో 9 రైళ్లను సిద్ధం చేశామని చెప్పారు. 70 మెట్రిక్‌ టన్నులతో కూడిన నాలుగు ట్యాంకర్లు రాయగఢ్‌ నుంచి దిల్లీకి చేరుకోబోతున్నట్లు వెల్లడించారు. ఒడిశాలోని అనుగుల్‌ నుంచి విజయవాడ, సికింద్రాబాద్‌లకు రెండు ఎక్స్‌ప్రెస్‌లను నడపాలని ప్రణాళిక రూపొందించినట్లు రైల్వేబోర్డు ఛైర్మన్‌ సునీత్‌ శర్మ తెలిపారు.

ఇదీ చూడండి:ఆక్సిజన్​ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details