లాక్‌డౌన్ సమయంలో దేశ రాజధాని న్యూదిల్లీలో పాల సరఫరాను సమన్వయం చేసేందుకు రేణిగుంట నుంచి హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు ప్రవేశపెట్టిన దూద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా సరఫరా చేసిన పాల రవాణా 12న నాటికి 4 కోట్ల లీటర్లను దాటిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. లాక్‌డౌన్‌కు మునుపు రేణిగుంట నుంచి న్యూదిల్లీకి పాలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నడిచే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ట్యాంకర్లను అమర్చి రవాణా చేసేవారు.
వినూత్న ఆలోచన...
కొవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కావడం వల్ల దేశ రాజధానికి పాల రవాణా దాదాపు నిలిచిపోయింది. దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే దేశ రాజధానికి పాలను రవాణా చేయడం కోసం ప్రత్యేకంగా దూద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ రైళ్లు మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సమానంగా రేణిగుంట నుంచి హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు మధ్య గల (2,300 కిమీ) దూరాన్ని కేవలం 34 గంటల్లో చేరుకుంటాయి.