దేశంలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, ఉన్నవాటి పొడిగింపుపై రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందాయి. దేశవ్యాప్తంగా 62 కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించగా తెలంగాణ నుంచి మూడే ఉన్నాయి. అవి కూడా వారానికోసారి నడిచేవే. రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి 12 కొత్త రైళ్లు జాబితాలో ఉండగా రైల్వేమంత్రుల రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందన్న విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి.
తెలంగాణలో కొత్తగా ప్రతిపాదనలు మూడు రైళ్లేనా ?
By
Published : Jun 22, 2020, 6:52 AM IST
దేశంలో వివిధ ప్రాంతాల మధ్య కొత్త రైళ్లకు సంబంధించి జోన్లవారీగా కసరత్తు పూర్తయింది. కొత్తవి ప్రవేశపెట్టడం, ఉన్నవాటి పొడిగింపుపై రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం- దేశవ్యాప్తంగా 62 కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని, 48 పాతవాటిని పొడిగించాలని, 13 రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలని ప్రతిపాదించారు. రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగడి సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి ఏకంగా 12 కొత్త రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. తెలంగాణ నుంచి మూడే ఉన్నాయి. అవికూడా వారానికోసారి నడిచేవే. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (దిల్లీ) మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్‌ను కర్ణాటకలోని బీదర్‌కు పొడిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ప్రకటనలో రైల్వేమంత్రుల రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందన్న విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇండియన్ రైల్వే టైంటేబుల్ కమిటీ (ఐఆర్‌టీటీసీ) సమావేశం ఇటీవల బెంగళూరులో జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లకు సంబంధించి చీఫ్ పాసింజర్ ట్రాఫిక్ మేనేజర్లు హాజరై చర్చించారు. ఈ ప్రతిపాదనలపై రైల్వేబోర్డు, రైల్వేమంత్రిత్వ శాఖ తుది తుదినిర్ణయం తీసుకోనున్నాయి. వీటిలో ఎన్ని రైళ్లు పట్టాలు ఎక్కుతాయన్నదానిపై స్పష్టత రానప్పటికీ ప్రతిపాదనల్లోనే పక్షపాత ధోరణేమిటన్నది నిపుణుల నుంచి వస్తున్న విమర్శ.
రెండు నెలల్లోనే 2 రైళ్లు
రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కర్ణాటకలోని బెళగావి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండునెలల్లోనే బెళగావి నుంచి బెంగళూరుకు, వాస్కో(గోవా)కు 2 కొత్త రైళ్లు పట్టాలెక్కించారు. ఐఆర్‌టీటీసీ సమావేశంలోనూ ఆయన రాష్ట్రానికే పెద్దపీట లభించడం గమనార్హం. యశ్వంత్‌పూర్ (బెంగళూరు) నుంచి- వారణాసి, నిజాముద్దీన్, వాస్కో, బీజాపూర్, హోస్పేట, తాంబరం తదితర ప్రాంతాలకు 8-9, బెంగళూరు నుంచి హోసూరుకు, రాయచూరు-కాకినాడ మరోటి.. మంగళూరు- కోయంబత్తూరుకు శతాబ్ది ప్రతిపాదించారు.
రాష్ట్రానికి దక్కని ప్రాధాన్యం
ప్రతిపాదనల్లో తెలంగాణ నుంచి మూడు రైళ్లే ప్రతిపాదించారు. సికింద్రాబాద్ నుంచి దిల్లీ, విశాఖపట్నం, తిరుపతికి వెళ్లే రైళ్లు కిటకిటలాడుతుంటాయి. ఈ రూట్లలో అదనపు రైళ్లను పట్టించుకోలేదు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి ముంబయి రైళ్ల డిమాండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
ఏపీ నుంచి 'రాజధాని' ఎప్పుడో?
తిరుపతి-నాగర్‌సోల్, కాకినాడ-రాయచూరు, నర్సాపూర్-బెంగళూరు, విజయవాడ-కర్నూల్, విశాఖ నుంచి- యలహంక (బెంగళూరు), సుబేదార్‌గంజ్‌కు ఒక్కో రైలు ప్రతిపాదించారు. బెంగళూరు నుంచి దిల్లీకి ఇప్పటికే డైలీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉండగా.. యశ్వంత్‌పూర్-నిజాముద్దీన్ మధ్య కొత్తగా మరో రాజధానిని ప్రతిపాదించారు. ఏపీ నుంచి ఒక్క రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా లేదు. తెలంగాణ నుంచి ఒకటే ఉంటే.. అదీ వారానికి రెండురోజులే. దేశంలో అనేక రూట్లలో డబుల్ డెక్కర్ రైళ్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. తాజా ప్రతిపాదనల్లో భువనేశ్వర్-రూర్కేలా మధ్య డబుల్‌డెక్కర్ ప్రతిపాదించడాన్ని నిపుణులు విమర్శిస్తున్నారు.