కరీంనగర్‌కు చెందిన రమేష్ ఈ మార్చి వరకు అశోక్‌నగర్‌లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అదే నెలలో లాక్‌డౌన్ వల్ల శిక్షణ సంస్థలు మూతపడ్డాయి. తిరిగి సొంతూరు వెళ్లిపోయాడు. ఇంట్లోనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఆన్‌లైన్ శిక్షణ తరగతులు వింటున్నాడు.
కరోనా నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా నగరంలో పోటీ పరీక్షల శిక్షణను కోచింగ్ సెంటర్లు మార్చుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు లాక్‌డౌన్ వేళ ప్రత్యామ్నాయాలపై సంస్థల నిర్వాహకులు దృష్టి పెట్టారు. ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. వర్చువల్ విధానంలో సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు తర్ఫీదునిస్తున్నారు. కొన్ని ప్రత్యేక స్టూడియోలూ ఏర్పాటు చేసుకున్నాయి. స్టూడియోల్లో ఫ్యాకల్టీతో పాఠాలు రికార్డు చేయించి పంపిస్తున్నాయి. నేరుగా లైవ్‌లోనూ పాఠాలు బోధిస్తున్నాయి. గూగుల్ మీట్స్, మైక్రోసాఫ్ట్ టీమ్జ్ తదితర యాప్‌ల సాయం తీసుకుంటున్నాయి. ఎక్కువగా యూట్యూబ్ లైవ్ వీడియోల ద్వారా శిక్షణ సాగుతోంది. లైవ్‌లో సందేహాలూ నివృత్తి చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాలు పంపితే.. సమాధాన పత్రాలు అప్‌లోడ్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఫ్యాకల్టీలు దిద్ది వాట్సాప్ ద్వారా ఎవరివి వారికి పంపిస్తున్నాయి.
ఫీజులు తక్కువే
ఆన్‌లైన్ కోచింగ్‌లో ఫీజులు తక్కువేనని విద్యార్థులు చెబుతున్నారు. గ్రూప్స్ కోచింగ్ కోసం రూ.20 వేల-రూ.30 వేలు ఖర్చు చేస్తే ఆన్‌లైన్‌లో ఏడాదికి రూ.6 వేల సబ్‌స్క్రిప్షన్‌లో కొన్ని వేల తరగతులకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉంటున్నాయంటున్నారు. కావాల్సిన మెటీరియల్‌ను వెతికి చదువుకోగలిగితే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులువేనని నిపుణులు చెబుతున్నారు.
బోసిపోతున్న ప్రాంతాలు