ధర పెరిగింది.. బిల్లు భారమైంది.. హైదరాబాద్ పేరుచెప్పగానే వెంటనే గుర్తొచ్చేది బిర్యానీ. నోరూరించే బిర్యానీతో పాటు ఆనియన్ సలాడ్‌ను రెస్టారెంట్లు ఉచితంగా ఇస్తుంటాయి. ఐతే ఉల్లి ధర పెరగడం వల్ల ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లు, దీనికోసం ప్రత్యేకంగా ఛార్జీని వసూలు చేస్తున్నాయి. పెద్దపెద్ద రెస్టారెంట్లు మాత్రం ఎప్పటిలానే ఉచితంగా ఉల్లిని అందిస్తున్నాయి.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో....
నగరంలో యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. వీటిలో ఫ్రైడ్ రైస్, మంచురియా, నూడుల్స్ లాంటి వాటితో ఉల్లిని ఇంతకుముందు ఉచితంగా అందించేవారు. అయితే ఇప్పుడు ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తోపాటు ఉల్లిని ఇవ్వటం కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మానేశాయి. ఉల్లి రేటు పెరిగినప్పటికీ... ఆహార పదార్థం రేట్లు పెంచటానికి ఉండదని... అందువల్లనే ఉల్లినివ్వటం మానేశామని ఆ ఫాస్టఫుడ్ సెంటర్ల ఓనర్లు చెబుతున్నారు.
అప్పుడు రూ.400.. ఇప్పుడు రూ.2000
రోజుకు 20 కిలోల ఉల్లి అవసరం ఉంటుందని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని తెలిపారు. ధరలు పెరగకముందు రూ.350 నుంచి రూ.400 ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.2000లకు పైగా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆహారపదార్థాలతో పాటు ఉల్లిని ఇవ్వడం లేదని చెప్పారు.
టిఫిన్ సెంటర్లలో
చిన్న చిన్న టిఫిన్ సెంటర్లలో దోశ లాంటి వాటిలో ఉల్లిని ఎక్కువ మోతాదులో వేయాల్సి ఉండగా... తక్కువగా వేస్తూ భోజన ప్రియులకు అందిస్తున్నారు నిర్వాహకులు.
ధర పెరిగినా.. డిమాండ్ తగ్గలేదు
నగరంలో నెల రోజుల నుంచి ఉల్లి ధరల పెరిగాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.80 నుంచి 170 వరకు ఉంది. వీటిని కొనలేని పరిస్థితి ఉందని సామాన్యులు చెబుతున్నారు. ఒకప్పుడు మార్కెట్‌కు వచ్చి 5 కిలోలు కొనే వాళ్లమని.. ఇప్పుడు కేవలం కిలో మాత్రమే తీసుకెళ్తున్నామని వినియోగదారులు అంటున్నారు. ప్రతి వంటకంలో ఉల్లి తప్పనిసరి అని అందుకే ధర ఎక్కువున్నా కొనుగోలు చేస్తున్నామని కొందరు తెలిపారు.