అనుమతులు లేని ప్లాట్లు, స్థలాల రిజిస్ట్రేషన్లను నిషేధించిన ప్రభుత్వం... క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇచ్చింది. మరోమారు క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం మొత్తానికి భూముల క్రమబద్ధీకరణకు అనుమతి ఇచ్చిన సర్కార్... హెచ్ఎండీఏ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26 వరకు అభివృద్ధి చేసిన లేవుట్లు, విక్రయించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చారు.
మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం
13:06 September 01
మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
క్రమబద్ధీకరణ కోసం ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ, ఈసేవతో పాటు క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను కూడా అభివృద్ధి చేయనున్నారు. వంద లోపు ప్రతి చదరపు మీటరుకు క్రమబద్ధీరణ రుసుమును 200 రూపాయలుగా ఖరారు చేశారు. 101 నుంచి 300 లోపు ప్రతి చదరపు మీటరుకు 400 రూపాయలు, 301 నుంచి 500 లోపు ప్రతి చదరపు మీటరుకు 600 రూపాయలు, 500 పైన ప్రతి చదరపు మీటరుకు 750 రూపాయలను రుసుంగా నిర్ధారించారు.
మురికివాడల్లో చదరపు మీటరకు క్రమబద్ధీకరణ రుసుము ఐదు రూపాయలు మాత్రమే. 3000 గజాల వరకు మార్కెట్ విలువలో 25శాతం, 3001 నుంచి 5000 గజాల వరకు మార్కెట్ విలువలో 50శాతం, 5000 నుంచి 10000 గజాల వరకు మార్కెట్ విలువలో 75శాతం, పదివేల గజాల పైన వందశాతం మార్కెట్ విలువను క్రమబద్ధీకరణ రుసుంగా వసూలు చేస్తారు. పదిశాతం ఖాళీ స్థలం లేకపోతే ప్లాటుధరలో 14శాతాన్ని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలలోపు అంటే 2021 జనవరి నెలాఖరు వరకు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించేందుకు గడువు ఇచ్చారు.
ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు రుసుం వెయ్యి రూపాయలు కాగా, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు రుసుం పదివేల రూపాయలు. అనుమతులు లేని ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోపోతే తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం ఉండబోదన్న ప్రభుత్వం... అనుమతులు లేని, క్రమబద్ధీకరణ చేసుకోని ప్లాట్ల క్రయవిక్రయాలు నిషేధమని స్పష్టం చేసింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ చేసుకోని ప్లాట్లలో భవననిర్మాణాలకు కూడా అనుమతులు ఇవ్వబోమని తెలిపింది.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలు, లేఅవుట్లు, నాలాలపై ఉన్నవి, ఎఫ్టీఎల్ పరిధిలోని భూములు, శిఖం స్థలాలను క్రమబద్ధీకరించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎఫ్టీఎల్ పరిధి మాస్టర్ ప్లాన్, రెవెన్యూ, సాగునీటి రికార్డుల ప్రకారం గుర్తించాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ భూముల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేశారు.