పార్లమెంట్ అభ్యర్థులపై తెరాస కసరత్తు తెరాస సిట్టింగ్ ఎంపీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల నగారా మోగడంతో... అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ తుది కసరత్తు చేస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి పార్లమెంటు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్న స్పష్టమైన లక్ష్యంతో తెరాస ఉంది. పార్టీ నుంచి 11 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ టిక్కెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నారు.
మళ్లీ బరిలోకి...
కరీంనగర్ నుంచి వినోద్, నిజామాబాద్‌లో కవిత మళ్లీ బరిలోకి దిగడంతో దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి, మెదక్ టికెట్ బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డికి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్‌కు టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని తెరాస శ్రేణుల అంచనా. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రిపదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం.. నల్గొండ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉంది.
పరిశీలనలో...
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వర రావు, మరికొందరు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహబూబ్‌నగర్ నుంచి ప్రస్తుత ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి... నాగర్‌కర్నూలు నుంచి పి.రాములు, మందా జగన్నాథం... మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, మాలోత్ కవిత, తదితరులు... వరంగల్ నుంచి పసునూరి దయాకర్, కడియం శ్రీహరి, గుడిమల్ల రవి కుమార్ తదితరులు పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బంధువులకు..?
మల్కాజిగిరిలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, పార్టీ నేతలు నవీన్ రావు, బండి రమేష్ టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్, బండి రమేష్ ప్రయత్నాల్లో ఉన్నారు. చేవెళ్లలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా.. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కూడా ఆశిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరితే.. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీలో ఉండొచ్చునన్న ప్రచారం జరుగుతోంది.
ఇవీ చూడండి:లోక్‌సభ బరిలో కాంగ్రెస్ సీనియర్లు