హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వేయికి పైగా వృద్ధాశ్రమాలు, అనాథశ్రమాలున్నాయి. నెలలో సగం రోజులు దాతల సాయంతోనే కొనసాగేవి. కరోనా నేపథ్యంలో రెండు నెలల నుంచి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాతలు రాకపోవడం వల్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. అద్దెలు కట్టలేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంటుందని ఆశ్రమాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ఆపన్నహస్తం అందిస్తుండగా.. మరికొన్ని చోట్ల అసలు ఆశ్రమాల వైపు ఎవరూ చూడడం లేదని పలువురు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధ్వాన్నంగా పరిస్థితి..
నెలలో 15 రోజులు ఇవి దాతల సాయంతోనే గడిచిపోయేవి. లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు నెలల నుంచి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రతి నెల అందే నిత్యావసరాలు పంపిణీ నిలిచిపోయింది. విరాళాలు ఆగిపోయాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల సందర్భంగా భోజనాలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. కొందరు నిర్వాహకులు అప్పులు చేసి మరీ ఆశ్రమాల్లో ఉంటున్న వారి ఆకలి తీరుస్తున్నారు. అధిక శాతం ఆశ్రమాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.