NVSS Prabhakar On Central Government Schemes: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. పదే పదే ఫెడరల్ స్పూర్తి గురించి మాట్లాడే కేసీఆర్.. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలో అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఫసల్ బీమా, ఆయుష్మాన్ భారత్ పథకాలను తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఎన్వీఎస్ఎస్ ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంటే.. సర్పంచ్లను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం తెలంగాణకు వచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహిస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు.