నెంబర్ ప్లేట్ ఉల్లంఘనలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు Number Plate Tampering in Hyderabad :ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు వాహదారులు చేస్తన్న చేష్టలను ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే.. నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా వాహనాల నెంబరు ప్లేట్లను మారుస్తున్నట్లు గుర్తించారు. రాచకొండ పోలీసుల అధ్యయనం ప్రకారం.. సరాసరి 100 నేరాలు జరిగితే.. 60 శాతం కేసుల్లో నిందితులు తప్పుడు ప్లేట్ల వినియోగిస్తున్నట్లు తేలింది. గంజాయి స్మగ్లింగ్, చైన్ స్నాచింగ్, దోపిడీ కేసుల్లో దాదాపు 90 శాతం ఇవే ఉంటున్నాయి. కొందరు నేరస్థులు తాము నేరం చేసే సమయంలో అప్పటికప్పుడు వాహనాలు కొట్టేసి వాటినే వినియోగిస్తున్నారు.
Traffic police focus on Number Plate Tampering :ఇటీవల ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు 200 కిలోల గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న నిందితులు పోలీసుల్ని ఏమార్చేందుకు మార్గమధ్యంలో ప్రతీ గంటకోసారి నెంబరు ప్లేటు మార్చారు. నగరంలో కలకలం రేపిన ఏడు వరుస చైన్ స్నాచింగ్ ఘటనల్లోనూ నిందితులు కొట్టేసిన వాహనాన్ని వాడారు. తప్పుడు నెంబరు ప్లేట్లు, కొట్టేసిన వాహనాలతో పోలీసుల్ని బురిడీ కొట్టిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌లో క్రమం తప్పకుండా తనిఖీలు, నాకా బందీ, ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఈ తరహా వాహనాలను గుర్తిస్తున్నారు.
నెంబర్ ప్లేట్లు మార్చి వాహనం నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం : నెంబర్ ప్లేట్లు మార్చిడం లేదా ట్యాంపర్ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై రాచకొండ పరిధిలో ఏడాదిలో ఇప్పటివరకు 199 మంది వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. న్యాయస్థానాలు 13 మందికి సాధారణ జైలుశిక్ష, 55 మందికి సామాజిక సేవ శిక్షలు విధించాయి. గొలుసు దొంగతనాలు, ఇళ్లల్లో చోరీలు, ఇతర కేసుల్లో ఎక్కువ మంది నిందితులు తప్పుడు నెంబరు ప్లేట్లు వినియోగిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నెంబరు ప్లేటు ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడంతో పెద్దఎత్తున వాహనాలు పట్టుబడుతున్నాయి.
నేపథ్యం, నేర చరిత్రపైనా ఆరా : రాచకొండ పరిధిలో గతేడాది మొత్తం 31,712 నెంబరు ప్లేటు ఉల్లంగ ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే రెట్టింపు సంఖ్యలో 69,420 కేసులు నమోదు చేసి రూ.1.56 కోట్ల జరిమానాలు విధించారు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న వారి నేపథ్యం, నేర చరిత్రపైనా ఆరా తీస్తున్నారు. నేర చరిత్ర ఉన్నట్లు తెలిస్తే కేసు నమోదు చేస్తున్నారు. లేనిపక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. డ్రగ్స్ రవాణా, చైన్ స్నాచింగ్‌ల కోసం తప్పుడు నెంబరు ప్లేట్లు ఉపయోగిస్తున్నారని.. నిరంతర డ్రైవ్‌లు, తనిఖీలతో ఈ తరహా ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేస్తే నేరస్థులు భయపడతారని రాచకొండ సీపీ చౌహాన్ చెబుతున్నారు. ఫలితంగా నేర నియంత్రణ సాధ్యమవుతుందని.. సాధారణ వాహనదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాలకు నెంబరు ప్లేట్లు బిగించుకోవాలని తెలిపారు.
ఇవీ చదవండి: