Numaish Exhibition in Hyderabad: నాంపల్లి నుమాయిష్ అంటే తెలియని నగర వాసులే ఉండరు. నూతన సంవత్సరం అంటే నగర వాసులకు మొట్టమొదట గుర్తుకు వచ్చేది ఈ సందడే. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రారంభం రోజే నుమాయిష్‌తో స్వాగతం పలకడం అనవాయితీ. ఈ ప్రదర్శనలో ఏటా ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది దాదాపు 15 వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు.
దేశం నలుమూలల నుంచి ఎంతో మంది హస్త కళాకారులు, వ్యాపారులు నుమాయిష్‌కు విచ్చేశారు. గుండు పిన్నీసు దగ్గర్నుంచి ఇంట్లో వాడుకునే కుర్చీలు, పెయింటింగ్‌లు, దుస్తులు, ఆహార పదార్థాల వరకు అన్నీ నుమాయిష్‌లో ప్రత్యేకమే. నాణ్యమైన కశ్మీరీ డ్రై ఫ్రూట్స్, శ్రీనగర్ నుంచి దుప్పట్లు మైసూరు నుంచి హస్తకళలతో సహా అన్ని ఇక్కడ లభిస్తాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా మైసూరు హస్తకళ వ్యాపారి ఏర్పాటు చేసిన దుకాణం అందరిని ఆకట్టుకుంటోంది.
నుమాయిష్ వచ్చిందంటే చాలు సందడి మొదలు: చెక్కపై క్లిష్టమైన బొమ్మల ఆకారాలను సైతం అవలీలగా చెక్కి, ప్రదర్శనకు ఉంచిన ఈ స్టాల్ ఈ ఏడాది ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాక శ్రీనగర్ నుంచి వచ్చిన పలు డ్రై ఫ్రూట్స్ దుకాణాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చక్కని నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ కావడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నుమాయిష్ వచ్చిందంటే చాలు సందడితో పాటు నాంపల్లి వద్ద ట్రాఫిక్ జామ్‌లు కూడా ఎక్కువే ఉంటాయి.
అంతేకాక నాంపల్లి ఎగ్జిబిషన్‌కు చేరుకునేందుకు మళ్లీ రాత్రి సమయంలో తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఇక్కట్లు తప్పవు. అందుకోసం ఈ ఏడాది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా హైదరాబాద్ మెట్రో నగర వాసులకు కాస్త ఊరట కలిగించే వార్తను అందించింది. నుమాయిష్ ఉన్న అన్ని రోజులూ అంటే ఫిబ్రవరి 15 వరకు రోజు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్ల సౌకర్యం అందుబాటులో ఉంచింది. అదే విధంగా నగరంలోని అన్ని చోట్ల నుంచి నుమాయిష్‌కు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మొత్తంగా ఈ ఏడాది ప్రజలకు అనేక ఏర్పాట్లతో నుమాయిష్ నిర్వాహకులు, ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు.
అసలు నుమాయిష్ ఎలా ఏర్పడిందంటే..?:ఫతే మైదాన్, పరేడ్ గ్రౌండ్ లాంటి చారిత్రకమైన మైదానాల జాబితాలోనిదే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కూడా 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదరీకి పంపించారు. ఆయన ఉస్మానియా పట్టభద్రుల సంఘం నేతలను ఆహ్వానించి వివరాలను తెలుసుకున్నారు.
ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువుల గురించి సాధారణ ప్రజలకు తెలుస్తుందని, అలాగే నిధులు కూడా సమకూరుతాయని వారు వివరించారు. అనంతరం నివేదికను సంస్థాన పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు పంపించారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నుమాయిష్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. అలా మొట్టమొదట 1938లో ప్రారంభమైన నుమాయిష్ 10 రోజులే నడిచింది.
హైదరాబాద్ స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి, వినియోగదారులను చైతన్యపరచడానికి ఇలాంటి ప్రదర్శన ఒకటి అవసరమన్న ఆలోచన మొదట చేసింది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ గ్రూప్. అందులో మీర్ అక్బర్ అలీ ఖాన్, నవాబ్ అహ్మదలీ ఖాన్, మెహెది నవాజ్ జంగ్ ముఖ్యులు. 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్‌లో నుమాయిష్ నిర్వహించారు. అప్పుడు 10 రోజుల నుంచి 15 రోజుల వరకు నిర్వహించారు.