తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌తో 'ఆట'లా..జాగ్రత్త సుమా !

అంబర్‌పేట పరిధిలో కీలక శాఖలో ఉద్యోగిగా పనిచేసే వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. అతను పక్కంటి వారితో కలిసి నిత్యం క్యారమ్స్‌ ఆడేవాడు. ఇంతలో ఇతనికి వైరస్‌ సోకడంతో అధికారులు అందరికీ పరీక్షలు చేశారు. నలుగురు కరోనా బారిన పడినట్లు తేలింది. ఒకరి పరిస్థితి విషమంగా మారి మృతిచెందాడు కూడా. మిగతా ముగ్గురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సదరు ఉద్యోగి ఇంట్లో 9 మందికీ కరోనా సోకింది. గాంధీలో కోలుకుంటున్నారు.

No play games in corona time
కొవిడ్‌తో ఆటలొద్దు!

By

Published : May 13, 2020, 9:54 AM IST

లాక్‌డౌన్‌తో ఖాళీగా ఉండలేక.. లాక్‌డౌన్‌తో చాలామంది ఇళ్లల్లో ఖాళీగా ఉంటున్నారు. దీంతో తమ ఇళ్ల చుట్టుపక్కలవారు అంతా ఒక దగ్గర చేరి రకరకాల ఆటలు ఆడుతున్నారు. క్యారమ్స్‌, చెస్‌, హౌస్సీ, అష్టాచమ్మా, పేకాట ఇతర ఆటల్లో మునిగి తేలుతున్నారు. ఒకేచోట ఐదు, పదిమంది చేరి సరదాగా గడుపుతున్నారు. అయితే ఈ సరదా మాటున కరోనా దాగి ఉందని వారికి తెలియకుండానే వైరస్‌ బారిన పడుతున్నారు. ఒక్కరికి వైరస్‌ ఉన్నా ఆడుతున్న అదరికీ సోకుతోంది. పేకాటలో ముక్కలు అందరి చేతులు మారుతుంటాయి. క్యారమ్స్‌లో కూడా కాయిన్లు, స్ట్రైకర్‌.. ఒకరి నుంచి ఒకరి చేతికి వెళతాయి. చెస్‌, హౌస్సీలో కూడా ఇలానే అందరూ చేతులు కలుపుతుంటారు. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ఈ ఆటలు ఆడే వారంతా దగ్గరగా అడుగులోపే కూర్చుంటారు. వైరస్‌ ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు అక్కడున్న కొందరిపై పడతాయి. లేదా ఆట వస్తువులపై పడినా.. వాటిని ఎవరైనా పట్టుకున్నా వారికీ వైరస్‌ అంటుకుంటుంది. అందుకే కొంతకాలంపాటు ఇలాంటి బృంద ఆటలకు దూరంగా ఉండటం మేలు. ఒకవేళ ఆడుకోవాలంటే కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం కావాలని చెబుతున్నారు.

వ్యాయామాలు తప్పనిసరి

ఇలాంటి ఆటలకు బదులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టడం మేలు. ఇంతకాలం శారీరక వ్యాయామానికి చాలామంది దూరమయ్యారు. ప్రస్తుతం అంతా ఇంటి వద్దే ఉండటంతో ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలి. ఇంటి చుట్టూ నడక, యోగాలాంటివి చేయవచ్చు. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి మరింత మేలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పుస్తకాలు చదువుకోవచ్చు. సంగీతం వినవచ్చు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా 'విత్తన మేళా'కు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details