తెలంగాణ

telangana

ETV Bharat / state

Fee Reimbursement : రెండేళ్లుగా విద్యార్థులకు అందని ఫీజు ​రీయంబర్స్​మెంట్​...

విద్యార్థులకు బోధన రుసుంలు, ఉపకారవేతనాల (Fee Reimbursement) మంజూరు ఆలస్యమవుతోంది. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు... ఫీజు కడితేనే ధ్రువపత్రాలిస్తామని కళాశాలలు చెప్పడంతో అప్పులు చేసి వాటిని చెల్లిస్తున్నారు. ప్రస్తుతం సగం మందికి మించి విద్యార్థులకు రెండేళ్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Fee Reimbursement : రెండేళ్లుగా విద్యార్థులకు అందని ఫీజు ​రీయంబర్స్​మెంట్​...
Fee Reimbursement : రెండేళ్లుగా విద్యార్థులకు అందని ఫీజు ​రీయంబర్స్​మెంట్​...

By

Published : Nov 30, 2021, 4:58 AM IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు(scholarships), బోధన రుసుముల(Fee Reimbursement) చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. కోర్సు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కావడం లేదు. దరఖాస్తులు పరిష్కరించి, నిధులు విడుదలచేసి టోకెన్లు జారీచేసి నెలలు గడుస్తున్నా చెల్లింపులు మాత్రం జరగడం లేదు. రెండేళ్ల క్రితం బకాయిలు చెల్లించేందుకు ఈ ఏడాదిలో మూడు నెలల క్రితం జారీచేసిన టోకెన్లకు నేటికీ చెల్లింపులు పూర్తికాలేదు. దీంతో విద్యార్థులు అప్పులుచేసి రుసుములు కట్టి ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది బోధన రుసుములు, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన నిధుల మొత్తం రూ.2,200-2,350 కోట్ల వరకు ఉంటోంది. ప్రభుత్వం ఏటా.. గడిచిన విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉపకారవేతనాలు, బోధన రుసుములను ప్రస్తుత విద్యాసంవత్సరంలో చెల్లిస్తూ వస్తోంది. ఈ లెక్కన 2019-20 ఏడాది తాలూకూ సొమ్ములు 2021 మార్చి 31లోపు, 2020-21 ఏడాదికి సంబంధించినవి 2022 మార్చి 31లోగా చెల్లించాల్సి ఉంది. కరోనా, ఇతర కారణాలతో చెల్లింపులు ఆలస్యమయ్యాయి. 2020-21 ఏడాదికి విద్యార్థుల పుస్తకాలు, బస్‌పాస్‌ ఖర్చుల కు ఇచ్చే ఉపకారవేతనాల సొమ్ములూ విడుదల కాలేదు.

బోధన రుసుములు, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించేందుకు సంక్షేమశాఖలు కాగితాలపై నిధులు విడుదల చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఆ బిల్లులన్నీ ఖజానాల్లోనే నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు 2019-20 ఏడాదికి సంబంధించిన బోధన రుసుముల బకాయిలు చెల్లించేందుకు 2020 సెప్టెబరులో టోకెన్‌లు జారీచేశారు. వాటి కాలపరిమితి 2021 మార్చి 31తో ముగిసినా నిధులు విడుదల కాలేదు. తాజాగా 2019-20 విద్యా సంవత్సర బకాయిల చెల్లింపు కోసం ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో మరోసారి టోకెన్లు జారీచేసినా, ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాలేదు.

రెండేళ్లయినా నిధులు రాలేదు

సెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా 2015లో కుత్బుల్లాపూర్‌ బౌరంపేటలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో ఏడాదిలో చేరా. 2018లో ఇంజినీరింగ్‌ పూర్తయింది. కోర్సు కొనసాగుతున్న సమయంలో ఉపకారవేతనం, బోధన రుసుముల కోసం దరఖాస్తు చేశా. సొమ్ములు రాలేదు. ధ్రువీకరణ పత్రాల కోసం కళాశాల యాజమాన్యాన్ని ఏడాది కాలంగా సంప్రదిస్తున్నా. బోధన రుసుములు రాలేదు...మొత్తం ఫీజు చెల్లిస్తేనే ఇస్తామంటున్నారు. - మహ్మద్‌ రియాజ్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్‌

పిల్లల భవిష్యత్తు కాపాడాలి

ళాశాల యాజమాన్యాలు కరోనాతో ఇప్పటికే కుంగిపోయాయి. కళాశాలల నిర్వహణ ఖర్చులు భరించలేక బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం బోధన రుసుములు విడుదలచేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. 2019-20 బకాయిలకు సంబంధించి మూడు నెలల క్రితం జారీచేసిన టోకెన్లకు వెంటనే చెల్లింపులు చేయాలి. -గౌరి సతీష్‌, అధ్యక్షుడు రాష్ట్ర ప్రైవేటు జూనియర్‌ కళాశాలల సంఘం

ఇదీ చదవండి:

DHARANI PORTAL: ధరణిలో సాంకేతిక సమస్యలతో రైతుల తీవ్ర ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details