Niranjan Reddy on Palamuru Rangareddy Project :ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమని వ్యవసాయ శాఖ మంత్రి సింగ్రెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం అని తెలిపారు. కృష్ణమ్మ నీళ్లను కలశాల్లో గ్రామ, గ్రామానికి తీసుకువచ్చి ప్రతి దేవాలయం, ప్రార్ధనాలయాల్లో అభిషేకం చేస్తామని.. 2015 జూన్ 11న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన సందర్భంగా భూత్పూర్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) అన్నారని మంత్రి గుర్తు చేశారు.
Palamuru Rangareddy Project Wet Run :'పరాయి పాలన ఒక శాపం.. స్వపరిపాలన ఒక వరం.. హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తాను. పాలమూరు రైతుల కాళ్లను కృష్ణా నీళ్లతో కడుగుతా' అని సీఎం కేసీఆర్ వాగ్ధానం చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) తెలిపారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఇంటిదొంగలు, పాలోల్లు, పక్కవాళ్లు, ఈర్ష, ద్వేషాలతో కేసులు వేశారని, కేంద్రం తొమ్మిదిన్నరేళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకపోవడం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారిందని అన్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా అనేక రకాల అవరోధాలు కల్పించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. సీఎం వ్యూహానికి ప్రతి వ్యూహం చేసి రాజ్యాంగబద్ధంగా అనుమతులు సాధించారని చెప్పారు.
Palamuru Rangareddy Dry Run Success : బ్యాంకులు రుణాలు ఇవ్వవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు రూ.25 వేల కోట్లు దశల వారీగా కేటాయించుకుని అత్యంత అద్భుతంగా ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని.. ఒక్కొక్కటీ 145 మెగావాట్ల మహా బాహుబలి పంపులు ఏర్పాటు చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. దశాబ్దాల క్రితమే కృష్ణా నీళ్లు పాలమూరుకు దక్కి ఉంటే దేశంలోనే ఒక హరితప్రాంతంగా, వ్యవసాయ ప్రాంతంగా, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో అగ్రభాగాన విలసిల్లేదని అన్నారు. ఈ ప్రాంత నేతల బానిస మనస్తత్వం, వెన్నెముక లేనితనం పాలమూరు ప్రజలకు శాపంగా నిలిచిందని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మించుకుని కృష్ణా నీళ్లను మలుపుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు.