గిరిజన ప్రాంతాల్లో చాలామటుకు ప్రసవాలన్నీ ఇంట్లోనే జరుగుతాయి. మలేరియా బాధితులు ఎక్కువ. పిల్లలకు వ్యాక్సిన్లు వేయడానికి వెళితే వింతగా చూసి తిట్టేవారు. ఏం చంపేయడానికి వచ్చావా అనేవారు. అటువంటి వారిలో మార్పు తేవడానికి చాలా కష్టపడ్డా అంటుంది రాజేశ్వరి. ‘ఇప్పుడు కూడా గర్భిణులను ప్రసవ సమయంలో ఆసుపత్రి వరకూ తీసుకురావడానికి డోలీలు లేదా మంచాలే శరణు. ఒక్కోసారి అర్ధరాత్రి సమయాల్లో ఆ ప్రాంతాలకు వెళ్లి మహిళలను వైద్యంకోసం నారాయణపురం ఆసుపత్రికి తీసుకొస్తా. నిజానికి వారిలో కొంత మార్పు తీసుకురాగలిగా. మొదట్లో వ్యాక్సిన్లు వద్దన్నవారే నన్ను అడిగి మరీ ఇప్పుడు తమ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు’ అని సంతోషంగా అంటోంది రాజేశ్వరి. గిరిజన స్త్రీలు గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం, బాలింతల ఆరోగ్య పరిరక్షణ, శిశువులకు వ్యాక్సిన్లు వంటి విషయాలపట్ల వారిలో అవగాహన తీసుకొచ్చారు.
ఆర్థిక స్థోమత లేక నర్సునయ్యా...
రైతు కుటుంబంలో పుట్టిన రాజేశ్వరి ఇంటర్ వరకు చదువుకుంది. బాల్యంలో గ్రామాలకు వచ్చి, సేవలందించే వైద్యులను చూసేది. డాక్టరు చదువు పూర్తి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్థోమత లేదు. దాంతో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే శేఖర్‌ని పెళ్లి చేసుకున్నారు. ‘వైద్యురాలిని కాలేకపోయినా, రోగులకు సేవలందించే నర్సుగానైనా మారాలని ఉందని, నా భర్తతో ఇదే చెప్పా. తన ప్రోత్సాహంతో కొత్తగూడెంలో ఏడాదిన్నరపాటు నర్సింగ్ కోర్సు చదివా. 2008లో భద్రాచలం, చర్ల ప్రాంతం సమీపంలోని కుర్నపల్లి ఆరోగ్య ఉపకేంద్రంలో నర్సుగా బాధ్యతల్లో చేరా. నాకు తొమ్మిది గ్రామాల బాధ్యత కేటాయించారు. అక్కడ మూడువేలమందికిపైగా గొత్తికోయలు అనే గిరిజనులుంటారు. ఇవన్నీ అడవిలో మారుమూల ప్రాంతాలు. ఇక్కడ పనిచేయాలంటే ధైర్యంతోపాటు, అంకితభావమూ ఉండాలి’ అని చెబుతుందీమె.
ఎందుకీ ఉద్యోగం అని మాత్రం అనుకోలేదు...
గిరిజనులకు అనారోగ్యం వస్తే.. ఆకులు, వేర్లతోనే ప్రకృతి వైద్యం చేసుకుంటారు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం అవుతుంది. ప్రమాదం ముంచుకొచ్చాక మా దగ్గరకు వస్తారు. అంతవరకూ రాకుండా నేనే వాళ్ల దగ్గరకు వెళ్లి వారికి ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకురావడం మొదలుపెట్టా. ‘కుర్నపల్లి, చన్నెంపాడు, చింతగుప్ప వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే సాహసమే చేయాలి. రహదారి సౌకర్యం మాటఅటుంచి, కనీసం నడవడానికీ వీలుండదు. వర్షాకాలంలో పూర్తిగా గ్రామాలకు సంబంధం లేనంతగా వాగులన్నీ పొంగి మార్గాలన్నీ మునిగిపోతాయి. బురదలో నడిచి వెళ్లడం చాలా కష్టం. అదే సమయంలో వారు ఎక్కువగా అనారోగ్యాలబారిన పడతారు. రోజుకొక గ్రామం చొప్పున తిరుగుతూ ఉంటా. ఒక్కోచోటకు వెళ్లాలంటే కనీసం 12 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. చివరి గ్రామమైతే 35 కి.మీ వెళ్లాలి. ఒంటరిగా ఈ ప్రాంతాలన్నీ పర్యటించి, అక్కడి వారికి నా వంతు సేవలందిస్తున్నా. వారి భాషనూ నేర్చుకున్నా. ఎవరికో తీవ్ర అనారోగ్యంగా ఉందంటూ అర్ధరాత్రిపూట కబురొస్తుంది. ఎమర్జెన్సీగా వెళ్లాలి. తక్షణం బయలుదేరతా. తీరా లైట్లు సౌకర్యం కూడా లేని ఆ ప్రాంతాల్లో నడిచి వెళ్లేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. అప్పుడు కూడా ఎందుకీ ఉద్యోగం అని మాత్రం అనుకోలేను. ఈ ఏడాది ‘నర్సెస్ డే’ను పురస్కరించుకుని జాతీయస్థాయిలో నైటింగేల్ అవార్డును అందుకున్నప్పుడు మరింత బాధ్యత పెరిగినట్లు అనిపించింది. గతేడాది జిల్లా కలెక్టరు, మంత్రి చేతులమీదుగా ఉత్తమ నర్సు పురస్కారం అందుకున్నా. ఇటువంటి సందర్భాల్లో సంతోషంగా ఉంటుంది’ అని చెబుతుందీమె.
మరవలేను:
ఓ సారి చెన్నంపాడుకు వెళ్లాలి. వర్షంతో దారులన్నీ బురదమయంగా ఉండటంతో నడుచుకుంటూ చాలా దూరం వెళ్లా. తీరా అక్కడికి వెళ్లి అందరినీ పరామర్శిస్తుంటే వింతగా, ఆశ్చర్యంగా చూశారు. ఆ తరువాతే తెలిసింది... ఆ గ్రామం ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని జరిపల్లె అని. కొంచెం భయం, ఆందోళనకు గురయ్యా. ఈ అనుభవాన్ని మర్చిపోలేను..... రాజేశ్వరి
ఇవీ చూడండి: అయినవారిని కోల్పోయినా.. అందరి వారయ్యారు!!