New Year parties 2022: కొత్త ఏడాది ముంగిట మద్యం ఏరులై పారుతుంది. ముఖ్యంగా డిసెంబరు 31 రాత్రి సంబరాల్లో భారీగా మద్యం తాగుతుంటారు. ఆ మత్తులో రోడ్లపై పట్టపగ్గాలేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటి నుంచే అప్రమత్తమై పక్కా కార్యాచరణతో రంగంలోకి దిగితేనే ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలిగేది. ప్రస్తుతం భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నా కొందరు పద్ధతి మార్చుకోవడంలేదు. 2021 నూతన సంవత్సరం సందర్భంగా గ్రేటర్ పరిధిలో రూ.310 కోట్ల మద్యం విక్రయించారు. ఈసారి రూ.400 కోట్ల మేర అమ్ముడయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా.
Liquor Celebrations: కరోనా వల్ల నగరంలో 2020 మార్చి చివరి వారం నుంచి మద్యం దుకాణాలను మూసేశారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. గత ఏడాది కొత్త సంవత్సర వేడుకల సమయంలో కొంత సడలింపులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. తదనుగుణంగా మద్యం అమ్మకాలు, వేడుకల విషయంలో సర్కారు కొన్ని సడలింపులు ఇస్తే ఈసారీ మద్యం విక్రయాలు భారీగా జరిగే అవకాశం ఉంది. మొత్తం 650 మద్యం షాపుల్లో పెద్దఎత్తున విక్రయించడానికి సరకు తెచ్చిపెట్టారు. బార్లు, పబ్‌లు, ఫాంహౌస్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పోలీసులు చర్యలు తీసుకుంటేనే
నగరంలో కొన్ని చోట్ల ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన మందుబాబులు వేరే దారుల్లో వెళుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగంలో 2 వేల మంది పోలీసులుండగా మిగతా రెండు కమిషనరేట్లలో కలిపి మరో 2 వేల మంది ఉంటారు. వీరంతా ఇప్పటి నుంచే తనిఖీలు మొదలుపెడితేనే మందుబాబుల వీరంగానికి అడ్డుకట్టపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.