తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త ఏడాది.. కొత్త దశాబ్దం.. ఎన్నెన్నో మార్పులకు వేదిక - 2020 happy new year

కొత్త ఏడాది.. కొత్త దశాబ్దం.. ఎన్నెన్నో మార్పులకు వేదిక కానుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలపైనా వీటి ప్రభావం ఉండబోతోంది. అందుకు అనుగుణంగా స్కిల్స్‌ పెంచుకోవాలి. ఆటోమేషన్‌ను, అభ్యర్థుల మధ్య పోటీని తట్టుకొని నిలబడాలన్నా.. ప్రతిభావంతంగా కెరియర్‌లో సాగిపోవాలన్నా.. నయా ధోరణులకు దీటుగా నైపుణ్యాలను నేర్చుకోవాలి.

New year  New decade Platform for many changes
కొత్త ఏడాది.. కొత్త దశాబ్దం.. ఎన్నెన్నో మార్పులకు వేదిక

By

Published : Dec 26, 2019, 11:36 AM IST

ఉద్యోగం సాధించుకోవడం, దాన్ని కాపాడుకోవడం రెండూ ఇప్పుడు సవాలుగా మారాయి. ఆధునిక టెక్నాలజీలో సాధించిన అభివృద్ధి ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తోంది. అలాంటి అడ్డంకులతో ఇబ్బందులు పడకుండా సాగిపోవాలంటే కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సూచిస్తోంది. వాటికి 2020లో మరింత ప్రాధాన్యం పెరగనుందని చెబుతోంది. ప్రపంచ ఎకానమీపై ప్రభావం చూపుతున్న 15 పరిశ్రమల్లోని 9 ప్రధాన రంగాలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన 350 మంది ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడి నివేదికను రూపొందించింది. ఆటోమేషన్‌ యుగంలో నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలపై దృష్టిసారించడం తప్పనిసరి.

ఉద్వేగ ప్రజ్ఞ

వ్యక్తి తన, ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకొని తగిన విధంగా ప్రతిస్పందించడాన్ని ఉద్వేగ ప్రజ్ఞ (ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ - ఈఐ) అంటారు. సంస్థ చిన్నదైనా, పెద్దదైనా ఎంతోమంది వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. అది సులువుగా, సౌకర్యంగా కొనసాగాలంటే భావోద్వేగాలపై పట్టు ఉండటం తప్పనిసరి.

సంధాన నైపుణ్యాలు

సమస్య ఎదురైనప్పుడు అందరికీ ఆమోదనీయమైన పరిష్కారాన్ని చూపడానికి చేసే ప్రయత్నాలను సంధాన నైపుణ్యాలు (నెగోషియేషన్‌ స్కిల్స్‌)గా పేర్కొంటారు. చొరవచూపడం, చర్చించడం, అందుకు తగిన సమయాన్ని కేటాయించడం, సమస్యను వ్యక్తిగతంగా తీసుకోకపోవడం వంటివి ఈ నైపుణ్యాల కిందకు వస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితుల్లో పనిచేయడానికి ఇవి చాలాముఖ్యం.

వ్యక్తుల నిర్వహణ

కాలంతో పోటీపడుతూ ఎంత ముందుకు వెళ్లినా.. సంస్థ అంటే మనుషుల సామూహిక పని ప్రదేశమే. అందరూ అందరితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి కుంగుబాటుకు, అనాసక్తికి గురవుతుంటారు. అప్పుడు వారిని ప్రోత్సహించడం తప్పనిసరి. ఎదుటివారి భావోద్వేగాలను గమనించి వారిని సరైన దిశగా నడిపించడమే వ్యక్తుల నిర్వహణ (పీపుల్‌ మేనేజ్‌మెంట్‌). స్వీయ భావోద్వేగాలపై అదుపు సాధించడం, పనిలో అందరినీ భాగస్వాములను చేయడం, స్పష్టమైన కమ్యూనికేషన్‌, ఎదుటివారి పట్ల సానుభూతి కలిగి ఉండటం, ప్రతి ఒక్కరి కృషిని గుర్తించడం వంటివి వ్యక్తుల నిర్వహణలో ముఖ్యమైనవి. వీటిపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

ఏకకాలంలో విభిన్నాలోచనలు

అవసరాన్నిబట్టి సృజనాత్మకంగా, తార్కికంగా.. రకరకాలుగా ఏకకాలంలో ఆలోచించడం, పని చేయగలగడం కాగ్నిటివ్‌ ఫ్లెక్సిబిలిటీ నైపుణ్యం కిందకి వస్తుంది. సందర్భాన్ని బట్టి ఒకదాని నుంచి మరోదానికి ఎంత త్వరగా ఆలోచనలను మార్చగలుగుతున్నారనేదీ పరిగణనలోకి వస్తుంది. ఒక రకంగా ఆలోచనల్లో మల్టీటాస్కింగ్‌ అని చెప్పవచ్చు. కొత్త దశాబ్దంలో పనిచేయడానికి ఈ స్కిల్స్‌ అవసరమని నివేదికలు చెబుతున్నాయి.

విమర్శనాత్మక ఆలోచన

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని విశ్లేషించి వీలైనన్ని పరిష్కారాలను ఆలోచించాల్సి ఉంటుంది. వాటిలో వేటివల్ల ఎక్కువ లాభం ఉంటుందో/ తక్కువ నష్టం కలుగుతుందో చూసుకోవాలి. వాటి ఆధారంగానే సరైన పరిష్కారం సాధ్యమవుతుంది. ఇదే విమర్శనాత్మక ఆలోచనా విధానం (క్రిటికల్‌ థింకింగ్‌). లాజిక్‌, రీజనింగ్‌లతో సమ్మిళితమై ఉంటుంది. ఇప్పుడు సంస్థలు ఈ నైపుణ్యాన్ని అభ్యర్థుల్లో ప్రత్యేకంగా కోరుకుంటున్నాయి. తీసుకునే నిర్ణయాలను స్వయంగా విశ్లేషించుకోవడం, విమర్శించుకోవడం, చెప్పేది శ్రద్ధగా వినడం తదితరాల ద్వారా ఈ స్కిల్‌ను వృద్ధి చేసుకోవచ్చు.

సృజనాత్మకత

రోజురోజుకీ మార్కెట్లోకి వినూత్న ఉత్పత్తులూ, సాంకేతికతలూ, కొత్త తరహా పని విధానాలూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో సంబంధిత రంగాల మధ్య పోటీ ఎక్కువవుతోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ ఉత్తమ సేవలు, వస్తువులను అందరికంటే ముందుగా, భిన్నంగా అందించేవారి అవసరం పెరుగుతోంది. అలా అందించాలంటే సృజనాత్మకత (క్రియేటివిటీ) కావాలి. తమ సామర్థ్యాన్ని తాము నమ్మడం, సొంత ఆలోచనలు చేయడం, క్రియేటివ్‌గా ఆలోచించేవారితో కలిసి పనిచేయడం వంటి వాటి ద్వారా అభ్యర్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. రాబోయే దశాబ్దంలో దీని ప్రాధాన్యం పెరగబోతోంది.

సేవాధారితం

పరిశ్రమలకు కాలానుగుణంగా కొత్త కస్టమర్లు వచ్చి చేరుతుంటారు. పరిశ్రమలూ వారి అవసరాలను ముందుగా గ్రహించి సిద్ధంగా ఉండాలి. వినియోగదారుల అంచనాలకు తగిన విధంగా వస్తువులు/ సేవలను అందించాలి. దీన్నే సేవాధారితం (సర్వీస్‌ ఓరియంటేషన్‌) అంటారు. కస్టమర్ల ఆలోచనలను గమనిస్తుండటం, వారి ఇష్టాలు, అయిష్టాలు, ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఈ స్కిల్స్‌ను ఉద్యోగార్థులు వృద్ధి చేసుకోవాలి.

క్లిష్ట సమస్యల పరిష్కారం

టెక్నాలజీ జీవితానికి సౌకర్యాలతోపాటు సమస్యలనూ తెచ్చిపెడుతోంది. ఆటోమేషన్‌లో నిర్ణయాలు చాలావరకు గత అనుభవాల ఆధారంగా జరుగుతాయి. కానీ కొన్నిసార్లు పరిస్థితుల్లో మార్పుల వల్ల ఆ విశ్లేషణ సరిపోకపోవచ్చు. అలాంటి సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం యంత్రాలకు సాధ్యం కాదు. అన్నింటినీ పరిశీలించి మనుషులు మాత్రమే త్వరితగతిన తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీన్నే క్లిష్ట సమస్యల పరిష్కారం (కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌) అంటారు. ఏ పరిశ్రమలో అయినా మొత్తం ఉద్యోగుల్లో కనీసం 36 శాతం మందిలో ఇలాంటి నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. దీనికి అనుగుణంగా నియామకాలు జరుగుతున్నాయి. ఈ ధోరణిఈ ఏడాది నుంచి ఇంకా పెరగబోతోంది.

నిర్ణయం తీసుకునే నేర్పు

సంస్థ అంటే ఎంతో సమాచారం ఉంటుంది. దాన్ని విశ్లేషించి, ఫలవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమర్థ మానవ వనరులు అవసరమవుతాయి. 2020లో అవకాశాలు అందుకోవాలంటే నిర్ణయం తీసుకునే నేర్పు (జడ్జ్‌మెంట్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్‌) ఉండాలి. సరైన సమాచారాన్ని సేకరించుకోవడం, భావోద్వేగాల ప్రభావానికి గురికాకపోవడం, నిర్ణయం తీసుకోడానికి తగిన సమయాన్ని కేటాయించడం, ఫలితాలను అంచనావేయడం, ప్రాధాన్యాలను గుర్తించడం, ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించడం వంటివి నిర్ణయం తీసుకునే నేర్పును రుజువు చేస్తాయి. అభ్యర్థులు వీటిని తెలుసుకోవాలి.

ఇతరులతో కలిసి పనిచేయడం

ఇది సాంఘిక నైపుణ్యం కిందకు వస్తుంది. సంస్థల్లో పని ఒకరిపైనే ఆధారపడి ఉండదు. నలుగురితో కలిసి పనిచేయాలి. ఇతరుల బలాబలాల ఆధారంగా పనులను పంచుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా అందరితో కలవాలి. ఇదే ఇతరులతో సమర్థంగా కలిసి పనిచేయడం (కో-ఆర్డినేటింగ్‌ విత్‌ అదర్స్‌). కొత్త దశాబ్దంలో దీని ప్రాధాన్యం పెరిగింది. ఈ నైపుణ్యం తప్పనిసరిగా అభ్యర్థుల్లో ఉండాలని సంస్థలు కోరుకుంటున్నాయి. దీన్ని పెంపొందించుకోవాలంటే బలమైన భావవ్యక్తీకరణ (కమ్యూనికేషన్‌) కావాలి. ఎదుటివాళ్లు చెప్పింది శ్రద్ధగా వినడం, అవసరమైనప్పుడు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడం, తీసుకోవడం వంటి లక్షణాలు వృద్ధి చేసుకోవడం ద్వారా ఇతరులతో కలిసి విజయవంతంగా పనిచేయవచ్చు.

ఇదీ చూడండి:'నా ప్రియుడితో మాట్లాడించండి.. లేదంటే చచ్చిపోతా'

ABOUT THE AUTHOR

...view details