నూతన సచివాలయ నిర్మాణం దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త భవనానికి ఈ నెల 27న శంకుస్థాపన చేయనున్నారు. భూమిపూజ చేసే స్థలానికి సంబంధించి స్పష్టత వచ్చింది. మొదట హెలీప్యాడ్ సమీపంలో శంకుస్థాపన చేస్తారని భావించినా... భూమిపూజ చేసే ప్రాంతంలో నిర్మాణం రావాలన్న అభిప్రాయం నేపథ్యంలో మార్పు జరిగినట్లు తెలుస్తుంది. డీబ్లాక్ వెనకవైపు ఉన్న ఉద్యానవనంలో భూమి పూజ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
సచివాలయంలోని కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న కార్యాలయాలను ఎక్కడకు తరలించాలన్న విషయమై అధికారులు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిన భవనాలన్నీ తిరిగిస్తే శాఖాధిపతుల కార్యాలయాల్లో మొత్తం 48 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. మిగతా స్థలంలో కార్యాలయాల సర్దుబాటు కోసం కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలనా శాఖల కార్యాలయాలు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోకి తరలించనున్నారు. మిగతా మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాల కోసం భవనాలను అన్వేషిస్తున్నారు. ఆయా మంత్రిత్వ శాఖలకు చెందిన శాఖాధిపతుల కార్యాలయాల్లోకి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రితో పాటు సంబంధిత శాఖల కార్యదర్శులు ఒకే చోట ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.