తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయ నిర్మాణ వ్యవధి పెంచండి: గుత్తేదార్లు - కొత్త సచివాలయ నిర్మాణం

దసరా పండగకు కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆలోగా టెండర్లు, ఒప్పందాల ప్రక్రియను పూర్తి చేసేలా కసరత్తు సాగుతోంది. భవన నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఇప్పటికే రాగా... సచివాలయ ప్రాంగణ చదునుతో పాటు భూసార పరీక్షలు కొనసాగుతున్నాయి. సచివాలయ నిర్మాణ వ్యవధిని మరో ఆరు నెలలు పొడగించాలని గుత్తేదార్లు కోరారు. పొడగింపు సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.

new Secretariat construction works will start from dasara festivel in hyderabad
సచివాలయ నిర్మాణ వ్యవధి పెంచండి

By

Published : Oct 8, 2020, 5:20 AM IST

కొత్త సచివాలయ నిర్మాణ కసరత్తు వేగవంతం అవుతోంది. దసరా పండగకు పనులను ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పాత భవన శిథిలాల తరలింపు మొత్తం పూర్తైంది. మొత్తం లక్షా 14వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలను తరలించారు. పాతభవనాల కూల్చివేతకు దాదాపుగా ఐదున్నర కోట్ల రూపాయలు, శిథిలాల ప్రాసెసింగ్ కోసం కోటి రూపాయలు ఖర్చయ్యాయి. కూల్చివేత సమయంలో మొబైల్ లైటింగ్ కోసమే 20 లక్షల రూపాయల మేర వ్యయం అయింది. మొత్తంగా కూల్చివేత, శిథిలాల తరలింపునకు ఆరున్నర కోట్ల రూపాయల మేర వ్యయం అయింది. వ్యర్థాల తరలింపు పూర్తైన నేపథ్యంలో నేలను చదును చేసే పనులు కొనసాగుతున్నాయి.

సబ్ కాంట్రాక్టర్లకు ఆస్కారం లేదు

కొత్త సచివాలయ నిర్మాణ నమూనాకు అనుగుణంగా నిర్మాణ ప్రాంతానికి సరిహద్దులను గుర్తించారు. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో భూసార పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఫలితాలకు అనుగుణంగా డ్రాయింగ్స్​ను రూపొందిస్తారు. అటు కొత్త భవన నిర్మాణం కోసం అనుమతులన్నీ ఇప్పటికే వచ్చాయి. కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక అనుమతులతోపాటు భారత విమానాశ్రయ సంస్థ, పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. వాటన్నింటి ఆధారంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అనుమతులు మంజూరు చేసింది. సచివాలయ నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్లకు ఆస్కారం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

సందేహాల నివృత్తి

టెండర్ ప్రక్రియలో భాగంగా బుధవారం ప్రీబిడ్ సమావేశం జరిగింది. రహదార్లు-భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆరు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. టాటా ప్రాజెక్ట్స్, ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లంజీ, ఎన్ సీసీ, కేపీసీ, జేఎంసీ కంపెనీలు ఇందులో ఉన్నాయి. టెండర్ బిడ్​కు సంబంధించిన సాంకేతిక అంశాలు, ఇతరాలపై సందేహాలను నివృత్తి చేశారు. కేవలం 12 నెలల సమయాన్ని మాత్రమే ఇవ్వడాన్ని సంస్థలు ప్రధానంగా ప్రస్తావించాయి. ఏడాది గడువులోగా సచివాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, అందుకు లోబడి మాత్రమే బిడ్లను దాఖలు చేయాలని ఆర్ అండ్ బీ శాఖ స్పష్టం చేసింది.

మొబిలైజేషన్ అడ్వాన్సులు లేవు

అటు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇవ్వాలని కొన్ని సంస్థలు కోరాయి. రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 13వ తేదీ వరకు గడువుంది. అదే రోజు సాంకేతిక బిడ్లను, 16వ తేదీన ఆర్థిక బిడ్లను తెరుస్తారు. అనంతరం వీలైనంత త్వరగా ఒప్పందాల ప్రక్రియను పూర్తి చేసి దసరా సమయంలో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి:గురువారం ముగియనున్న ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ

ABOUT THE AUTHOR

...view details