తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త మంత్రులు వీరే!

మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. దాదాపు జాబితా పూర్తయింది. ఖరారైన వారికి సీఎం సమాచారం కూడా పంపారు. ఎస్టీ, మహిళ కోటా మంత్రుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. సన్నిహితుల వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

తెలంగాణ మంత్రివర్గం జాబితా సిద్ధం

By

Published : Feb 18, 2019, 6:52 AM IST

Updated : Feb 18, 2019, 8:10 AM IST

తెలంగాణ మంత్రివర్గం జాబితా సిద్ధం
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై దాదాపు స్పష్టత వచ్చినట్లే. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. పూర్వ ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్​నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనున్నట్లు తేలుస్తోంది. తొలి విడతలో రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు చోటు ఉండకపోవచ్చంటున్నారు.
తొమ్మిది మందితో మంత్రి మండలి ఖరారైంది. ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్​కు మరోసారి అవకాశం దక్కనుంది. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నకు చోటు లేనట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో నలుగురు బీసీలకు అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. మహిళ, గిరిజన కోటా ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. ఖరారైన వారికి కేసీఆర్ సమాచారం ఇచ్చారు. చోటు దక్కని ఆశావహులతో మాట్లాడి బుజ్జగించినట్లు సమాచారం.
ఆదిలాబాద్‌ నుంచి అనుభవజ్ఞుడైన ఇంద్రకరణ్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఎస్టీ, మహిళ కోటాలో రేఖానాయక్‌ను ఎంపిక చేస్తారని భావించినా... రెండో విడతలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
అనుభవం, సామాజిక వర్గం దృష్ట్యా హైదరాబాద్ నుంచి తలసానికి మరోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన పద్మారావును ఉపసభాపతి లేదా విప్​గా నియమించొచ్చని సమాచారం.
సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతోపాటు సామాజిక సమీకరణాలతో నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ నుంచి ఉద్యమ సహచరుడైన కొప్పుల ఈశ్వర్​కు ఎస్సీ కోటాలో​, ఈటల రాజేందర్​కు మరోసారి అవకాశం కల్పించినట్లు సమాచారం.
మహబూబ్​నగర్ జిల్లాలో ఉన్న 14 స్థానాల్లో 13 తెరాస గెలిచినందున సముచిత ప్రాధాన్యం కల్పించాలని సీఎం భావించినట్లు సమాచారం. సామాజిక సమీకరణలతో నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్​లను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
నల్గొండ నుంచి మరోసారి జగదీశ్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి రెండో విడతలో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
వరంగల్ నుంచి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం ఎంపిక చేశారు. కడియం శ్రీహరికి శాసనమండలి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
కార్యనిర్వాహక అధ్యక్ష హోదాలో కేటీఆర్​కు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారని తెలిసింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత సమీకరణల ఆధారంగా ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.
Last Updated : Feb 18, 2019, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details